సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం !

National convention to mark 9 months of farmers protest begins at Singhu border - Sakshi

సెప్టెంబర్‌ 25న భారత్‌బంద్‌

రైతు సమ్మేళనం ఏకగ్రీవ తీర్మానం

న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృత స్థాయికి తీసుకెళ్లాలని రైతు సంఘాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులోభాగంగా సెప్టెంబర్‌25వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయించాయి. గురువారం ఢిల్లీ దగ్గర్లోని సింఘు సరిహద్దు వద్ద ప్రారంభమైన అఖిలభారత రైతు సమ్మేళనం ఈ మేరకు తీర్మానించింది. సాగు చట్టాలపై పోరుకు 9 నెలలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రెండ్రోజుల రైతు సమ్మేళనాన్ని గురువారం భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌ లాంఛనంగా ప్రారంభించారు.

‘తొమ్మిది నెలలుగా ఉద్యమిస్తున్నా..
రైతులతో ఫలప్రదమైన చర్చలకు మోదీ సర్కార్‌ ముందుకు రాకపోవడం చాలా దారుణం. అయినా మేం మా ఉద్యమపథాన్ని వీడేదే లేదు. ఈ కాలంలో మేమేం కోల్పోయామో, మేం సంఘటితంగా ఏమేం సాధించామో సర్కార్‌కు తెలిసేలా చేస్తాం’ అని రాకేశ్‌ తికాయత్‌ అక్కడి రైతులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ రైతు సమ్మేళనంలో 22 రాష్ట్రాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికుల సంఘాలు, సంస్థల తరఫున నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 18 అఖిలభారత కార్మిక సంఘాలు, తొమ్మిది మహిళా సంఘాలు, 17 విద్యార్థి, యువజన సంఘాల తరఫున వందలాది మంది రైతులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. సమ్మేళనంలో తొలి రోజున మూడు వేర్వేరు సెషన్స్‌ నిర్వహించినట్లు సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పేర్కొంది.

పారిశ్రామిక రంగ కార్మికులు, వ్యవసాయ రంగ కార్మికులు, గ్రామాల్లోని పేదలు, గిరిజనుల సమస్యలనూ ఆయా సెషన్స్‌లో చర్చించారు. సమ్మేళనంలో నిర్వహణ కమిటీ కన్వీనర్‌ ఆశిష్‌ మిట్టల్‌ సంబంధిత ముసాయిదాను రైతు నేతల ముందుంచారు. ‘మోదీ సర్కార్‌ రైతుల డిమాండ్లకు తలొగ్గి వివాదాస్పద చట్టాలను రద్దుచేసేలా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఉద్యమాన్ని ఉధృతస్థాయికి తీసుకెళ్లాలి’ అని సమ్మేళనంలో తీర్మానించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు హానికరమని ఈ సందర్భంగా ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సూర్య నారాయణ, రావుల వెంకయ్య, ఝాన్సీ, తెలంగాణ నుంచి టి.సాగర్, ప్రభు లింగం, కె.రంగయ్య, అచ్యుత రామారావు, జక్కుల వెంకటయ్య, రాంచందర్, గోపాల్‌ పాల్గొన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top