మోదీయే అతిపెద్ద చొరబాటుదారు | Narendra Modi is biggest infiltrator says Mamata Banerjee | Sakshi
Sakshi News home page

మోదీయే అతిపెద్ద చొరబాటుదారు

Mar 22 2026 6:04 AM | Updated on Mar 22 2026 6:08 AM

Narendra Modi is biggest infiltrator says Mamata Banerjee

పశ్చిమ బెంగాల్‌ ముంఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు

కోల్‌కతా: బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వేలాదిమంది చొరబాటు దారులు పశ్చిమబెంగాల్‌లో తిష్టవేశారంటూ విమర్శలు గుప్పిస్తున్న ప్రధాని మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. శనివారం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జరిగిన రంజాన్‌ వేడుకల్లో మమత పాల్గొని ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, బహుళ సామాజిక వైవిధ్యం పరిరక్షణకు జరుగుతున్న పోరాటమే ఈ శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ ఓటు హక్కును మోదీ జీ, బీజేపీ లాక్కునేందుకు చేసే యత్నాలను అడ్డుకుంటా.

 చివరిదాకా పోరాడతా. కోల్‌కతా నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా ప్రతిచోట కేంద్రం అసంబద్ధ నిర్ణయాలను సవాల్‌చేస్తా. మీరు(మోదీ) ముస్లిం దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పాలకులతో కరచాలనం చేస్తారు. స్నేహబంధంపై ప్రసంగాలిస్తారు. తీరా భారత్‌కు వచ్చాక హిందూ–ముస్లిం అంటూ విడగొడతారు. ఓటర్ల పేర్లను ‘సర్‌’ జాబితా నుంచి అన్యాయంగా తొలగించారు. పైగా వాళ్లపై చొరబాటుదారులు అనే ముద్రవేస్తున్నారు. 

ఓట్ల జాబితాలోకి చొరబడిన మీరే అసలైన చొరబాటుదారులు’’ అంటూ మోదీ, బీజేపీ ప్రభుత్వాలపై మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బెంగాల్‌లో అప్రకటిత రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. మా నుంచి పాలనాధికారం లాగేసుకోవాలని చూస్తున్నారు. అయినాసరే మేం భయపడబోం’ అని మమత అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముస్లింలనుద్దేశించి మమత మాట్లాడారు. ‘‘మీకు తోడుగా ఎవరు నిలబడకపోయినాసరే మీకు అండగా నేనుంటా. బెంగాల్‌లో మతాలు, కులాలు, వర్గాల తేడా లేకుండా అందర్నీ కుటుంబసభ్యుల్లా చూసుకుంటా. 

ఎవరైనా రాజకీయంగా రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోను. ప్రజలను మతాల మాటున విడదీయాలనుకునే వాళ్లకు ఇక్కడ స్థానం లేదు. నేరుగా నరకానికి పొండి. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు ఇక్కడ అంతా కలిసిమెలసి ఉంటారు. ఈ ఐకమత్యాన్ని చెడగొట్టేవాళ్లను మనం రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వొద్దు’’ అని బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. మమత ప్రసంగంపై బీజేపీ మండిపడింది. ‘‘ దేశ ప్రధానిని చొరబాటుదారుడు అంటూ సంబోధించే వాళ్లకు సీఎం కుర్చీ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చునే హక్కు లేదు. ఆమెకు మతిపోయిందేమో. వెంటనే రాంచీకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే మంచిది’’ అని రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత సువేంధు అధికారి వ్యాఖ్యానించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement