సైనికులపై హత్య కేసు

Nagaland Civilians Killings: Police Files Murder Case Against Security Forces - Sakshi

21వ పారా స్పెషల్‌ ఫోర్స్‌పై ఎఫ్‌ఐఆర్‌ 

ఐపీసీ సెక్షన్‌ 302, 307, 34 కింద 

కేసు పెట్టిన నాగాలాండ్‌ పోలీసులు

కోహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో సైనిక దళాల కాల్పుల్లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యులుగా గుర్తిస్తూ 21వ పారా స్పెషల్‌ ఫోర్స్‌ జవాన్లపై సోమవారం సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోన్‌ జిల్లాలోని తిజిత్‌ పోలీసు స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 302, 307, 34 కింద కేసు పెట్టారు. హత్యా, హత్యాయత్నం, నేరపూరిత చర్య అభియోగాల కింద ఈ కేసు నమోదయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో మోన్‌ పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. 

నాగాలాండ్‌ బంద్‌ ప్రశాంతం 
జవాన్ల కాల్పుల్లో 14 మంది అమాయక కూలీల మృతికి నిరసనగా పలు గిరిజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం నాగాలాండ్‌ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా భద్రతా దళాలు, విద్యార్థుల మధ్య స్వల్పంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐదు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని నాగా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌) ప్రకటించింది.

వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడమే కూలీల త్యాగానికి అసలైన నివాళి అవుతుందని ఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు ఉద్ఘాటించారు. శనివారం, ఆదివారం జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం 28 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. 

హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌ ఒక్కరోజు నిలిపివేత 
సందర్శకులతో సందడిగా కనిపించే నాగా సంప్రదాయ గ్రామం కిసామా సోమవారం ఎవరూ లేక బోసిపోయింది. ఇక్కడ జరుగుతున్న హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌ను ప్రభుత్వం నిలిపివేయడమే ఇందుకు కారణం. కూలీల మరణానికి సంతాప సూచకంగా నాగాలాండ్‌ ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ను ఒక్కరోజు నిలిపివేసింది. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్శించడమే లక్ష్యంగా ఈ వేడుకను ప్రతిఏటా 10 రోజులపాటు రాజధాని కోహిమా సమీపంలోని కిసామా గ్రామంలో వైభవంగా నిర్వహిస్తుంటారు.

హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌లో పాల్గొనబోమంటూ పలు గిరిజన సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి.  మృతిచెందిన 14 మంది కూలీల కుటుంబాలకు నాగాలాండ్‌ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్ర రవాణా మంత్రి పైవాంగ్‌ కోన్యాక్‌ విలేజ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌కు ఈ పరిహారం మొత్తాన్ని అందజేశారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.11 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర సీఎం నీఫియూ రియో చెప్పారు. జవాన్ల కాల్పుల్లో మరణించిన 14 మంది కూలీల అంత్యక్రియలను సోమవారం మోన్‌ జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్‌ గ్రౌండ్‌ వద్ద నిర్వహించారు. 


బలగాల కాల్పులపై మోన్‌లో స్థానికుల ఆందోళన 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు 
జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సోమవారం కేంద్రం, నాగాలాండ్‌ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సైనికుల కాల్పులు, అమాయక కూలీల మృతిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, నాగాలాండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల అనంతరం జనం ఎదురుదాడిలో మృతిచెందిన జవాను ఉత్తరాఖండ్‌ రాష్ట్రం తెహ్రా జిల్లా నౌలీ గ్రామానికి చెందిన గౌతమ్‌లాల్‌ అని అధికారులు వెల్లడించారు. అతడు ‘21 బెటాలియన్‌ ఆఫ్‌ పారాచూట్‌ రెజిమెంట్‌’లో పారాట్రూపర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top