క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో

Mumbai Police chalks Out Security plan in Light of Row Festivals - Sakshi

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు శ్రమిస్తోన్న పోలీసు శాఖ 

వరుసగా మహావీర్, హనుమాన్‌ జయంతులు, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్, రంజాన్‌ పండుగలు 

మే1న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం వేడుకలపై ఉత్కంఠ 

ఇదే నెలలో శరద్‌ పవార్‌ ఇంటిపై ఆర్టీసీ ఉద్యోగుల దాడి, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇంటివద్ద వివాదం  

అదనపు భారంతో ఒత్తిడికి చిత్తవుతోన్న పోలీసులు 

సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన ముంబైలో వేసవి ఎండలతోపాటు రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. గల్లీల్లో జరుగుతున్న రాజకీయ సభలు, ఆ తర్వాత వివిధ మతాల ఉత్సవాలు, రాజకీయ నేతల హెచ్చరికలు, వివిధ సంఘటనల ఆందోళనల కారణంగా ముంబైలో ఏ క్షణంలోనైనా శాంతి, భద్రతలు అదుపు తప్పే అవకాశాలున్నాయి. దీంతో గత 20 రోజుల నుంచి ముంబైలో జరుగుతున్న నేరాల ను అదుపు చేయడంతోపాటు బందోబస్తు, శాంతి, భద్రతలను కాపాడటం పోలీసులకు నిత్యకృత్యమైంది. దీంతో నగర పోలీసులపై అదనపు పని భా రం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కంటే స్టేట్‌ రిజర్వుడు పోలీసు ఫోర్స్‌ (ఎస్‌ఆర్‌పీఎఫ్‌) బలగాలను మరింత పెంచాల్సి వచ్చింది.  

వరుసగా పండుగలు..వివాదాలు.. 
ప్రపంచంలో లేదా దేశంలో ఎక్కడా అల్లర్లు, మత ఘర్షణలు, బాంబు పేలుళ్లు, ఇతర ఎలాంటి ఘటనలు జరిగినా ముందుగా ముంబై నగరాన్ని అప్రమత్తం చేయడం పరిపాటిగా మారింది. దీనికి తోడు ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే లౌడ్‌స్పీకర్లపై చేసిన ప్రకటన యావత్‌దేశంలో వివాదాస్పదంగా మారింది. రాజ్‌ ఠాక్రే చేసిన ప్రకటనతో ముంబై, మహారాష్ట్ర సహా దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వివాదం నడుస్తుండగానే రాజకీయాల్లో సీనియర్‌ నాయకుడు, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ ఇంటిపై ఆర్టీసీ ఉద్యోగులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వెలుగులోకి వచ్చింది.

అనంతరం ఈ నెల 14న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి, మహావీర్‌ జయంతి, గుడ్‌ ఫ్రై డే, హనుమాన్‌ జయంతి, ఈస్టర్, వచ్చే నెలలో మే 1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఆ తర్వాత 3న రంజాన్‌ ఇలా వరుసగా ఒకదాని తర్వాత మరొకటి వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు వస్తున్నాయి. మే మూడో తేదీలోపు మసీదులపై ఉన్న లౌడ్‌స్పీకర్లను తొలగించాలని రాజ్‌ఠాక్రే మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు. లేదంటే మసీదుల ఎదుట అంతకు రెట్టిం పు లౌడ్‌స్పీకర్లు పెట్టి హనుమాన్‌ చాలీసా పఠనం చేస్తామని హెచ్చరించారు. గడువు దగ్గర పడుతున్న కొద్దీ సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది.

చదవండి: (హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు!)

నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముంబైలో గట్టి పోలీసు బందో బస్తూ ఏర్పాటు చేయడంతోపాటు పోలీసు రికార్డు ల్లో నేర చరిత్ర ఉన్న నేరస్తులందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. మోహళ్ల కమిటీ, శాంతి కమిటీ, సామాజిక సంస్థలు, ఉత్సవ మండళ్ల ప్రతినిధులు, అన్ని మత గురువులతో సమావేశం నిర్వహించారు. నేరశాఖ పోలీసులు సోషల్‌ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. మత ఘర్షణలు సృష్టించే సందేశాలను, పోస్టులను తొలగించారు.

కొత్త వివాదానికి తెరలేపిన రాణా దంపతులు 
శాంతి భద్రతలను అదుపులో ఉంచే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎంపీ నవనీత్‌ కౌర్‌ రాణా, ఎమ్మెల్యే రవీ రాణా బాంద్రా కళానగర్‌లోని మాతోశ్రీ బంగ్లా ఎదురుగా హనుమాన్‌ చాలీసా పఠిస్తామని ప్రకటించి కొత్త వివాదానికి తెరలేపారు. ముస్లింల పవిత్ర రంజాన్‌ మాసం కొనసాతున్న నేపథ్యంలో మరోసారి శాంతి, భద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని ముందే గ్రహించిన ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. హనుమాన్‌ చాలీసా పఠనంపై రాణా దంపతుల పట్టుదల, బీజేపీ నేత కిరీట్‌ సోమయ్య, మోహిత్‌ కంబోజ్‌లపై జరిగిన దాడుల కారణంగా పోలీసులపై పని భారం విపరీతంగా పెరిగిపోయింది.

ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. మత ఘర్షణలు, శాంతి, భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే వెంటనే నియంత్రించేందుకు ముంబై పోలీసులకు తోడుగా ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు చెందిన 19 కంపెనీలను ముంబైలో నియోగించారు. వీరితోపాటు అల్లర్ల నియంత్రణ బలగాలు, క్విక్‌ రెస్పాన్స్‌ టీం, వివిధ దళాలకు చెందిన బలగాలను అప్రమత్తం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top