తమిళనాడు సీఎంగా స్టాలిన్‌

MK Stalin takes oath as Chief Minister of Tamil Nadu - Sakshi

ప్రమాణం చేయించిన గవర్నర్‌ పురోహిత్‌

ఎన్నికల హామీల అమలుకు కొత్త సీఎం ఉత్తర్వులు

కోవిడ్‌ సాయంగా రేషన్‌ కార్డు దారులకు రూ.2వేలు విడుదల

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను భారీ విజయం దిశగా నడిపిన ముత్తువేల్‌ కరుణానిధి(ఎంకే) స్టాలిన్‌(68) ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. స్టాలిన్‌తోపాటు 33 మంది మంత్రులతో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణస్వీకారం చేయించారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ను అనుసరించి 500 మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

కొత్త కేబినెట్‌ గ్రూప్‌ ఫొటో

ఉదయం 9.10 గంటలకు ‘ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ అనే నేను..’అంటూ స్టాలిన్‌ తన ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు. అనంతరం, డీఎంకే సీనియర్‌ నేత, పార్టీ జనరల్‌ సెక్రటరీ దురై మురుగన్‌ ప్రమాణం చేశారు. ఆయనకు జల వనరుల శాఖ, నీటిపారుదల ప్రాజెక్టులు, గనులు, ఖనిజాల శాఖలను అప్పగించారు. మంత్రులంతా డీఎంకే అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం తమిళంలోనే ప్రమాణం చేశారు. స్టాలిన్‌ క్యాబినెట్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కింది. హోం, సాధారణ ప్రజా వ్యవహారాల నిర్వహణ, ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ తదితర విభాగాలను స్టాలిన్‌ తన వద్దే ఉంచుకున్నారు.

అయితే, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు క్యాబినెట్‌లో చోటివ్వలేదు. కార్యక్రమం అనంతరం స్టాలిన్‌ రాజ్‌భవన్‌ నుంచి గోపాలపురంలో తండ్రి కరుణానిధి నివసించిన ఇంటికి వెళ్లి తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై, కరుణాని«ధి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సచివాలయానికి చేరుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సమావేశమై కరోనా పరిస్థితులను సమీక్షించారు.

మొదటి విడత కోవిడ్‌ సాయం విడుదల
సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌ ప్రధాన ఎన్నికల హామీల అమల్లో భాగంగా పలు చర్యలను ప్రకటించారు. కోవిడ్‌ సాయం కింద బియ్యం కార్డు దారులకు రూ.4 వేలకు గాను మొదటి విడతగా రూ.2 వేలను ఈ నెలలోనే అందజేసేందుకు ఉద్దేశించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో, రాష్ట్రంలోని 2,07,67,000 రేషన్‌ కార్డు దారులకు రూ.4,153.69 త్వరలో అందుతాయి. అదేవిధంగా, ప్రత్యేక బీమా పథకం కింద కోవిడ్‌ బాధితులకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే ఆవిన్‌ పాల ధరను లీటరుపై రూ.3 తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చారు. శనివారం నుంచి రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఆర్డినరీ సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న  హామీ అమలుకు ‘మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి’పథకం అమలు కోసం ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top