పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ హైలెవెల్‌ మీటింగ్‌ | Middle East Tensions: Pm Modi High Level Review | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ హైలెవెల్‌ మీటింగ్‌

Mar 22 2026 6:35 PM | Updated on Mar 22 2026 8:56 PM

Middle East Tensions: Pm Modi High Level Review

ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చ జరిపారు. ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించింది.

పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మధ్య పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన పరిస్థితులను సమీక్షించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది.

విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటి కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ (LPG) కేటాయింపులను కేంద్రం పెంచింది. గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ (PNG) కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా పోర్టు కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని.. ఎలాంటి రద్దీ లేదని అధికారులు తెలిపారు. సరఫరాలను మెరుగుపరిచే క్రమంలో, అమెరికాలోని టెక్సాస్ నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో వస్తున్న ఒక కార్గో నౌక మంగళూరులోని 'న్యూ మంగళూరు పోర్టు'కు చేరుకుంది. మార్చి 14 నుంచి మార్చి 31 వరకు ముడి చమురు, ఎల్‌పీజీపై కార్గో సంబంధిత ఛార్జీలను మాఫీ చేసినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

కాగా, భారత జెండాతో మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్‌ నౌకలు ‘పైన్‌ గ్యాస్‌’, ‘జగ్‌ వసంత్‌’ త్వరలో ఉద్రిక్తమయ హార్మూజ్‌ గుండా పయనించి స్వదేశానికి చేరుకోనున్నాయి. గత 24 గంటలుగా హార్మూజ్‌ గుండా ఎలాంటి నౌకల సంచారం లేకపోయినా అదే జలసంధి గుండా ఈ రెండు ఎల్పీజీ నౌకలు సాహసోపేత ప్రయాణం సాగించనున్నాయని రాయిటర్స్‌ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణాన్ని నిలిపేసి హార్మూజ్‌కు దూరంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జా సమీప నౌకాశ్రయంలో ఈ రెండు నౌకలు లంగరువేశాయని, త్వరలోనే ప్రయాణం ఆరంభిస్తాయని నౌకలను ట్రాక్‌ చేసే సంస్థ ‘మెరైన్‌ట్రాఫిక్‌’ వెల్లడించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement