కాంగ్రెస్‌లో భారీ సంస్కరణలు!

Massive reforms in Congress Party - Sakshi

బీసీ, ఎస్సీ, ఎస్టీలు పెరగాలి

సీడబ్ల్యూసీ నుంచి ఏఐసీసీ, పీసీసీల దాకా 50 శాతం వారే ఉండాలి

ఏఐసీసీ ప్యానళ్ల ప్రతిపాదనలు

నేడు సీడబ్ల్యూసీ భేటీలో చర్చ!

న్యూఢిల్లీ: అంతర్గతంగా బలోపేతం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగతంగా భారీ సంస్కరణలు తప్పనిసరి అని సీనియర్‌ నేతల్లో అత్యధికులు భావిస్తున్నారు. అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) మొదలుకుని ఏఐసీసీ, పీసీసీ నుంచి బ్లాక్‌ స్థాయి దాకా అన్ని కమిటీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా బాగా పెరగాలని అభిప్రాయపడుతున్నారు.

దాన్ని ఇప్పుడున్న 20 శాతం నుంచి కనీసం 50 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. వచ్చే వారం రాజస్తాన్‌లో జరగనున్న కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనల ముసాయిదాల తయారీకి ఏర్పాటైన ఏఐసీసీ ప్యానళ్లు ఇదే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ ప్రతిపాదనలు కార్య రూపం దాల్చాలంటే ఏఐసీసీ ప్యానళ్లతో పాటు సీడబ్ల్యూసీ, చింతన్‌ శిబిర్‌ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. చింతన్‌ శిబిర్‌ సన్నాహకాల్లో భాగంగా సోమవారం జరిగే సీడబ్ల్యూసీ భేటీలో వీటిని సమర్పించనున్నారు.

పదవులనూ తగ్గించాలి
ఏఐసీసీలోనూ, పీసీసీల్లోనూ అన్ని విభాగాల్లో పదవులను కనీస స్థాయికి తగ్గించాలని సంస్థాగత వ్యవహారాల కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సంఖ్యపై గరిష్ట పరిమితి విధించాలని పేర్కొన్నట్టు చెప్తున్నారు. ‘‘ఉదాహరణకు ఏఐసీసీలో 100 మందికి పైగా కార్యదర్శులున్నారు. ఈ సంఖ్యను 30కి తగ్గిస్తే మేలు. పీసీసీల్లోనూ ఈ పరిమితిని పాటించాలి’’ అని ప్యానల్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు. ముకుల్‌ వాస్నిక్‌ సారథ్యంలోని సంస్థాగత వ్యవహారాల కమిటీలో రమేశ్‌ చెన్నితాల, తారిఖ్‌ అన్వర్, అజయ్‌ మాకెన్‌ తదితరులున్నారు. అలాగే డీసీసీ అధ్యక్షులను ఢిల్లీ నుంచి ఏఐసీసీ స్థాయిలో నామినేట్‌ చేసే పోకడకు స్వస్తి పలికి పీసీసీ నాయకత్వమే నియమించుకునేలా చూడాలన్న ప్రతిపాదన కూడా ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top