మహమ్మారిపై పోరులో టీకాయే కీలకం

Manmohan Singh writes to PM Modi on Covid-19 - Sakshi

పలు సూచనలతో ప్రధాని మోదీకి మాజీ ప్రధాని మన్మోహన్‌ లేఖ

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారిపై పోరులో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం చాలా అవసరమని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. కోవిడ్‌–19 సంక్షోభంపై కాంగ్రెస్‌ అత్యంత సీనియర్‌ నేత అయిన మన్మోహన్‌ సింగ్‌ ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన నిర్మాణాత్మక సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని నమ్మకం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న అంశాలివీ...

► దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌లో ఎంతమందికి టీకా వేశామన్నది కాకుండా జనాభాలో ఎంత శాతం మందికి టీకా అందిందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం జనాభాతో పోలిస్తే కోవిడ్‌ బాధితుల సంఖ్య చాలా సంఖ్య చాలా తక్కువ కాబట్టి, సత్వరమే సరైన విధానాలను అమలు చేస్తే మెరుగైన ఫలితాలను మనం సాధించవచ్చు.
► కోవిడ్‌–19 నివారణలో వాడే కీలక ఔషధాల ఉత్పత్తిని పెంచాలి. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ డ్రగ్స్‌ అనుమతుల విషయంలో విధించిన నిబంధనలనే కోవిడ్‌ విషయంలోనూ అమలు చేయాలి. దీని ఫలితంగా, కరోనా టీకా ఉత్పత్తిని చేపట్టే కంపెనీల సంఖ్య పెరుగుతుంది.  
► వ్యాక్సిన్‌ అందాల్సిన 45 ఏళ్లలోపు ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల ఎంపిక విషయంలో రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ కల్పించాలి.  
► వచ్చే 6 నెలలకు గాను ఎన్ని డోసుల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది? ఆయా డోసులను రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయనుంది? వంటి అంశాలనుబహిరంగ పర్చాలి.
► దేశ అవసరాలకు తగ్గట్లుగా టీకా డోసుల ఉత్పత్తిని పెంచేందుకు వ్యాక్సిన్‌ తయారీదారులకు ప్రభుత్వం సాయంగా నిలవాలి.  పెరుగుతున్న అవసరాల దృష్ట్యా.. యూరోపియన్‌ యూనియన్, అమెరికాలలో పర్మిషన్‌ పొందిన విదేశీ టీకాలను నేరుగా వ్యాక్సినేషన్‌కు అనుమతించాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top