రికార్డులు బ్రేక్.. బుట్ట మామిడి పండ్ల ధర @ 31వేలు.. ఎక్కడో తెలుసా..? 

Mango crate sold for Rs 31,000 in auction - Sakshi

సాక్షి, ముం‍బై : వేసవి కాలం వస్తోందంటే నోరూరించే వివిధ రకాల మామిడి పండ్లు మార్కెట్లో కనిపిస్తుంటాయి. దీంతో అందరి కళ్లు మామిడి పండ్లపైనే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రకాల మామిడి పండ్లను ప్రత్యేక పేర్లతో పిలుస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో రసాలు, బంగినపల్లి మామిడి పండ్లు ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. కాగా, ఈ ఏడాది మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. మార్కెట్ కు పండ్ల పెట్టెలు వస్తున్నాయి. దీంతో మార్కెట్ లో మామిడి పండ్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. 

శుక్రవారం పూణెలోని ఏపీఎంసీ మార్కెట్ కు ఈ సంవత్సరంలో మొదటిసారిగా దేవ్‌గఢ్ రత్నగిరి నుంచి ప్రసిద్ధి చెందిన హాపస్ మామిడి పండ్లను తీసుకువచ్చారు. ఈ క్రమంలో పండ్ల పెట్టెకు అక్కడి వ్యాపారులు పూల మాల వేసి ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం వేలంలో భాగంగా ఒక్క పెట్టె మామిడి పండ్లకు రికార్డు స్థాయిలో రూ. 31,000 పలకడం అందరినీ ఆశ‍్చర్యానికి గురి చేసింది. 

ఈ సందర్భంగా వ్యాపారి యువరాజ్ కాచి మాట్లాడుతూ.. ప్రతీ సీజన్ ప్రారంభంలో మొదటిసారిగా మార్కెట్ కు వచ్చే మామిడి పండ్లను వేలం వేస్తారని తెలిపారు. ఎందుకంటే తర్వాత రోజుల్లో వేలంలో పండ్ల పెట్టెను కొన్న ధర ఆధారంగానే రేటు ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం వేలంలో రూ. 5వేలతో ప్రారంభమైన మామిడి పండ్ల పెట్టె ధర చివరకు రూ. 31వేల బిడ్ ధర పలికిందన్నారు. కాగా, మొదటి పెట్టెకు రూ. 18వేలు, రెండోది రూ. 21వేలు, మూడోది రూ. 22,500, నాల్గొవది రూ. 22,500లకు బిడ్‌ వేయగా ఐదో పెట్టెకు రూ. 31 వేలు పలికినట్టు వ్యాపారి తెలిపారు.

గత 50 ఏళ్ల కాలంలో పూణే మార్కెట్ లో మామిడి పండ్లు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండేళ్లుగా కోవిడ్ కారణంగా వ్యాపారం బాగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్కెట్ బాగా జరగాలని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top