బ్యాగులో లక్ష్మీ కటాక్షం: అమ్మ తోడు సార్‌.. ఆ పదిలక్షల బ్యాగ్‌ నాదే!

Man Arrested For Theft case in Manguluru - Sakshi

యశవంతపుర: వైన్‌షాపులో మద్యం తాగి బయటకు వచ్చిన శివరాజ్‌ అనే వ్యక్తికి రోడ్డుపై రూ. 10 లక్షల డబ్బు దొరికింది. తన జతలో ఉన్న కూలీకి కొంత డబ్బు ఇచ్చి మిగతాది తీసుకెళ్లాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

బ్యాగులో లక్ష్మీ కటాక్షం 
నవంబర్‌ 27న మంగళూరులో పంప్‌వెల్‌ వద్ద కూలీలు శివరాజ్, తుకారామ్‌లు కలిసి ఓ బ్రాందీషాపులో మద్యం తాగి రోడ్డు పక్కలో నిలబడి ఉండగా ఓ బ్యాగ్‌ రోడ్డు పైన పడి ఉంది. శివరాజ్‌ దానిని తీసుకుని ఉత్కంఠగా తెరిచి చూడగా అందులో ఐదువందలు, రెండు వేల నోట్లు ఉన్న బండిళ్లు కనిపించాయి. అమ్మో ఎంత డబ్బో అని ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. నాకెంత అని తుకారామ్‌ అడగడంతో రెండు వేల రూపాయల నోట్ల కట్టను ఇచ్చాడు. అందులో రెండు నోట్లు తీసి ఇద్దరు కలిసి మళ్లీ మద్యం తాగి ఎవరి దారిలో వారు వెళ్లిపోయ్యారు. ఆనందం పట్టలేని శివరాజ్‌ ఒక్కడే మళ్లీ వైన్‌షాపుకు వెళ్లి తాగాడు. కంకనాడి పోలీసులు అతని ప్రవర్తన చూసి బ్యాగ్‌లో ఏముందో చూపాలని అడిగారు. డబ్బులు కనిపించటంతో వెంటనే  జీపులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తుకారామ్‌కు ఇచ్చిన డబ్బులను తీసుకురావాలని చెప్పి మూడు రోజుల పాటు స్టేషన్‌లోనే పెట్టుకున్నారు. తుకారామ్‌ జాడ తెలియని కారణంగా శివరాజ్‌ను వదిలిపెట్టలేదు.  

రూ. 3.50 లక్షలు ఉన్నాయి: కమిషనర్‌ 
ఈ విషయం అనోటా ఈ నోటా మంగళూరు నగరమంతా పాకింది. ఈ డబ్బులు వక్క  వ్యాపారులదిగా తెలిసింది. ఓ వ్యాపారి వెళ్లి డబ్బులు తనవేనని పోలీసులను కలిశాడు. కానీ ఇది నీ డబ్బులు కాదంటూ వ్యాపారిని మందలించి పంపారు. చివరకు తమకు దొరికిన బ్యాగులో 10 లక్షలు లేవు. రూ.49 వేలు ఉన్నట్లు పోలీసులు వాదించారు. ఇంతవరకూ తమ డబ్బులు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తాగుబోతు వద్ద రూ. మూడున్నర లక్షలు మాత్రమే లభించిన్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్‌ శశికుమార్‌ తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఎవరు పోగొట్టుకున్నారో గుర్తిస్తామని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top