మమత బెనర్జీ వ్యూహమేంటి? ప్రత్యామ్నాయం అవుతారా?

Mamata Banerjee unite the opposition and make BJP an alternative? - Sakshi

విపక్షాలను ఏకం చేసి... బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తారా?

విస్తరణ, చేరికలు అందుకేనా!

కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే ప్రణాళికతో ముందుకు...

మోదీని ఢీకొట్టే ఏకైక నేతగా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం

ఈ ఏడాది మార్చి– ఏప్రిల్‌ నెలల్లో బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ– అమిత్‌ షా ద్వయం మమతా బెనర్జీని ఓడించడానికి చేయని ప్రయత్నం లేదు. ఈడీ, సీబీఐ దాడులతో సహా అష్టదిగ్భందం చేశారు. ఏకాకిగా మారినా... సువేందు అధికారి, ముకుల్‌రాయ్‌లతో సహా సన్నిహితులందరూ దూరమైనా... మమత మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి నిలిచారు.

294 సీట్లలో ఏకంగా 213 స్థానాల్లో నెగ్గి ‘హ్యాట్రిక్‌’ కొట్టారు. మూడోసారి సీఎంగా పదవిని చేపట్టారు. అంతే బెంగాల్‌ సివంగి పేరు జాతీయ రాజకీయ యవనికపై మార్మోగిపోయింది. బలమైన నాయకుడు మోదీని, బీజేపీ ‘ఢీ’ కొట్టి నిలిచే దమ్మున్న నాయకురాలిగా ఆమెను రాజకీయ పండితులు కీర్తించారు. ఈ విజయం ఇచ్చిన ఊపుతో మమత కూడా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు.

2024 సార్వత్రిక ఎన్నికలపై కన్నేసి బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికగా మూడో కూటమిని నిర్మించే  దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. భావ సారూప్యత కలిగిన వ్యక్తుల భేటీల పేరిట రాజకీయపక్షాలనే కాకుండా, వివిధ రంగాల్లోని మేధావులు, ఉద్యమకారులను కలుస్తూ... తనను తాను ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. బుధవారం రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిశాక... ‘ఇక యూపీఏనే లేదు’ అంటూ ప్రకటించి... బీజేపీ వ్యతిరేక ఐక్యకూటమిని నాయకత్వం వహించాలనే తన ఆకాంక్షను విస్పష్టంగా బయటపెట్టారు.

దేశవ్యాప్త రాజకీయ ఉనికిని, వందేళ్లకు పైగా చరిత్ర కలిగి జనసామాన్యంలో గుర్తింపును, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్‌ పార్టీని... బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే స్థానం నుంచి తప్పించే సామర్థ్యం ‘దీదీ’కి ఉందా? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాగలదా? బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయగలదా? దాదాపు 200 స్థానాల్లో బీజేపీని నేరుగా ఎదుర్కొనే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను కాదనుకొని మమతా వెనుకనడిచే విపక్ష, ప్రాంతీయ పార్టీలు ఎన్ని? వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

ఇళ్లు చక్కదిద్దుకోండి...
సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీని ఏడాదికి పైగా నడుపుకొస్తున్నారు. ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి. భావినేతగా భావించిన రాహుల్‌గాంధీ సత్తా ఏంటో తేలిపోయింది. పోరాటపటిమ లోపించిందని, రాజకీయాలను సీరియస్‌గా తీసుకోరనే ముద్ర పడిపోయింది. పైగా కాంగ్రెస్‌ అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. సీనియర్లతో కూడిన జి–23 గ్రూపు అధినాయకత్వాన్నే ప్రశ్నిస్తోంది. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో పంజాబ్‌లో పరువుబజారున పడింది. అమరీందర్‌ సింగ్‌ను పొమ్మనకుండా పొగపెట్టడంతో ఆయన సొంత పార్టీనే స్థాపించారు.

దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని సీఎంగా చేసినా... పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ నిత్యం ఏదో ఒక తలనొప్పి తెస్తూనే ఉన్నారు. నాలుగు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఈ కుమ్ములాటలు ఏంటని కాంగ్రెస్‌ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇక రాజస్తాన్‌లో సీఎం అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలెట్‌ వర్గాల మ ధ్య ఆధిపత్యపోరు అందరికీ తెలిసిందే. చత్తీస్‌గఢ్‌లోనూ భూపేష్‌ బఘేల్‌పై అసంతృప్తి చాలాకాలంగా రగులుతోంది. దీదీ ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్‌నే లేవనెత్తుతున్నారు. ఇంటిని చక్కదిద్దుకోలేని వాళ్లు... ఇతరులకు ఏం నాయకత్వం వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.  

మరెవరు ఉన్నారు...?
మోదీ ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు/ రాహుల్‌కు లేనపుడు మరెవరున్నారు? శరద్‌ పవార్‌కు 80 ఏళ్లు, రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్నారు. ఒకప్పుడు మోదీకి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కల చెదిరి ఎన్డీయే పంచన చేరిపోయారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా... బీసీ నాయకుడిగా (కుర్మీ) నితీశ్‌కు ఉన్న ఇమేజి నుంచి లబ్దిపొందేందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునేందుకు కమలదళం ఆయనకు సీఎం పీఠం అప్పగించింది. 21 ఏళ్లుగా ఒడిశా సీఎంగా కొనసాగుతున్న నవీన్‌ పట్నాయక్‌ (75 ఏళ్లు) ఎన్డీయే నుంచి వైదొలిగినా... ఇరుపక్షాలకు సమదూరం పాటిస్తూ తటస్థ వైఖరితో ఉన్నారు. పైగా ఆయనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు లేదు. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తానన్న ఒకప్పటి బ్యూరోక్రాట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ, పంజాబ్‌ను దాటి ప్రభావం చూపలేకపోయారు.  

వెనుకడుగు వేయకపోవడమే దీదీ బలం
రాజకీయాల్లో చేరినప్పటి నుంచే మమతకు ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. పోరాటమే ఆమె ఊపిరి. ఎట్టి పరిస్థితుల్లో, ఎంతటి ప్రతికూలతలు ఎదురైనా తలవంచని నైజం. మొన్నటి బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలతో ఆమె ధీరత్వం మరింత ప్రస్పుటమైంది. మోదీని ఢీకొట్టే శక్తి ఆమెకే ఉందని జనబాహుళ్యంలో అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు విపక్షాలకు రోజురోజుకు కాంగ్రెస్‌పై నమ్మకం సడలుతోంది. ఈ రెండింటినీ తనకు అనుకూలాంశాలుగా మలచుకొని... మోదీకి ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రొజెక్ట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మమత.

యూపీ (80), మహారాష్ట్ర (48) తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న మూడోరాష్ట్రం బెంగాల్, 2019లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో (43.39 శాతం ఓట్లతో) 22 సీట్లు సాధించిన మమత... తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఓట్లశాతాన్ని 47.94 శాతానికి పెంచుకోగలిగారు. 2024కు వచ్చేసరికి బెంగాల్‌లో 42 సీట్లలో కనీసపక్షం 35 గెలిచినా... ఒకటి, రెండు లోక్‌సభ స్థానాలుండే ఈశాన్యరాష్ట్రాలు, గోవా లాంటి చోట్ల విస్తరిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్‌తో పొసగని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక్కటే ప్రస్తుతం మమతతో సన్నిహితంగా మెలుగుతోంది.

2024 ఇంకా సమయం ఉంది కాబట్టి ఇతర ప్రాంతీయ పార్టీలు వేచిచూసే ధోరణిని అవలంభిస్తాయి. ఆలోపు మాత్రం కాంగ్రెస్‌ను వీలైనంతగా దెబ్బతీసి... తనను తాన ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం మమత సీరియస్‌గా చేస్తున్నట్లు కనపడుతోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆమె అడుగులు, ఎత్తుగడలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే వీలైనంతగా విపక్షనేతలను కలిసి వారితో సంబంధాలు నెరుపుతున్నారు. వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు.  

ఈశాన్యంలో విస్తరణపై దష్టి
అఖిల భారత మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న సుస్మితా దేవ్‌ (అస్సాం)ను టీఎంసీలో చేర్చుకున్నారు. రాజ్యసభకు పంపారు. రాయిజోర్‌ దళ్‌ నేత, ఎమ్మెల్యే అఖిల్‌ గొగోయ్‌ను ఆయన పార్టీని టీఎంసీలో విలీనం చేయాలని కోరారు. అస్సాం అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే తమకు ముఖ్యమని, అందుకే విలీనానికి అంగీకరించలేదని, తృణమూల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ఆయన ప్రకటించారు. త్రిపురలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాన్ని దష్టిలో పెట్టుకొని నాలుగైదు నెలలుగా త్రిపురలో బలపడటానికి మమత గట్టి ప్రయత్నమే చేశారు. కాకపోతే మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం 334 స్థానాలకు గాను బీజేపీ 329 చోట్ల నెగ్గి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. సీట్లు రాకున్నా త్రిపురలో ఎంట్రీ ఇచ్చిన కొద్దినెలల్లోనే టీఎంసీ దాదాపు 20 శాతం ఓట్లను తెచ్చుకోవడం గమనార్హమని అభిషేక్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు.  

మేఘాలయలో కాంగ్రెస్‌కు చావుదెబ్బ
మేఘాలయలో 17 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను మమత గట్టి దెబ్బకొట్టారు. నవంబరు 24న మాజీ సీఎం ముకుల్‌ సంగ్మాతో సహా 12 ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా అక్కడ టీఎంసీ ప్రతిపక్షపార్టీగా అవతరించింది. 2022 ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగే గోవా ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన టీఎంసీ వేగంగా పావులు కదిపింది. కాంగ్రెస్‌ కురువృద్ధుడు, మాజీ సీఎం లుజిన్హో  ఫలేరోను, భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండ్‌ పేస్‌ను మమత అక్కున చేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే లుజిన్హో ఫలేరోను బెంగాల్‌ నుంచి రాజ్యసభకు పంపారు.

టీఎంసీ ఉపాధ్యక్షుడిగా కూడా నియమించారు. మేఘాలయ, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో తృణమూల్‌కు రాష్ట్ర పార్టీగా ఇప్పటికే గుర్తింపు ఉంది. ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ కీర్తీ ఆజాద్, రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న అశోక్‌ తన్వర్‌లు గత వారమే టీఎంసీలో చేరారు. జి–23 నేతల్లోనూ చాలామందితో ఆమె టచ్‌లో ఉన్నారనేది తెరపైకి వస్తున్న మరో కొత్త అంశం. ఇటీవలే జీ–23 నేతల్లో ఒకరైన గులాంనబీ ఆజాద్‌కు సన్నిహితులైన నలుగురు మాజీ కశ్మీర్‌ మంత్రులతో సహా 20 మంది కాంగ్రెస్‌ గుడ్‌బై కొట్టారు. సుస్మితాదేవ్, లుజిన్హో ఫలేరోలను పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభకు పంపడం ద్వారా కాంగ్రెస్‌ నేతలకు తాను సముచిత స్థానం, గౌరవం ఇస్తానని మమత సంకేతాలు పంపుతున్నారు.         

అఖిలపక్షానికీ దూరం
పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సోమవారం (నవంబరు 29) రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో అఖిలపక్ష భేటీ జరిగింది. దీనికి తృణమూల్‌ కాంగ్రెస్‌ దూరంగా ఉండటం గమనార్హం. ఆప్‌ కూడా డుమ్మా కొట్టింది. అలాగే 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌పై నిరసనల్లోనూ టీఎంసీ... కాంగ్రెస్‌కు దూరం పాటించింది. లోక్‌సభలో వాకౌట్‌ కూడా చేయలేదు.

రాజ్యాంగంలో రాసుందా?  
నవంబరు 22న మమత ఢిల్లీకి వచ్చారు. మూడురోజులు దేశరాజధానిలో ఉన్నారు. బెంగాల్‌కు సంబంధించిన వ్యవహారాలపై ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తారని అంతా భావించినా... అలాంటిదేమీ జరగలేదు. ఇదే విషయాన్ని 24న ఓ విలేకరి ప్రశ్నిం చగా... మమత సహనం కోల్పోయారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ సోనియాను కలవడం తప్పనిసరా? అలాగని రాజ్యాంగంలో రాసుందా? అంటూ సదరు విలేకరిని ఎదురు ప్రశ్నించారు. నేనెవరి అపాయింట్‌మెంట్‌నూ కోరలేదు... వారు పంజాబ్‌ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. వారి పార్టీ కోసం వారిని పనిచేసుకోనివ్వండి’ అని అన్నారు. దీదీకి కాంగ్రెస్‌ పొడగిట్టడం లేదని ఆమె మాటలు స్పష్టం చేశాయి.

– నేషనల్‌ డెస్క్, సాక్షి   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top