బిగ్‌ ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ యూటర్న్‌.. ఒక వ్యక్తి ఒకే పదవికి రాంరాం!

Mallikarjun Kharge To Stay On As Leader Of Opposition - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొనసాగించనుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే..  

ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌లో ‘ఒక వ్యక్తి.. ఒకే పదవి’ సిద్ధాంతానికి తూట్లు పొడిచినట్లు అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌ తీర్మానం ప్రకారం.. ఎవరికైనా ఇది వర్తిస్తుందని రాజస్థాన్‌ కాంగ్రెస్‌​ ముసలం సమయంలో ఆ పార్టీ ఎంపీ, కీలక నేత రాహుల్‌ గాంధీ నొక్కి మరీ చెప్పారు. అయినప్పటికీ ఖర్గేనే కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుత నిబంధనల ప్రకారం మరో పదవిలో కొనసాగడానికి వీల్లేదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి మరొకరికి ఇప్పటిదాకా ఎంపిక చేయలేదు కాంగ్రెస్‌​ అధిష్టానం. దీంతో ఆయనే ఇంకా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇక ముందు కూడా ఆయన్నే కొనసాగించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూప్‌ రేపు(శనివారం) సోనియా నివాసంలో భేటీ కానున్నారు. ఈ భేటీకి రాజ్యసభ నుంచి ఖర్గే, జైరామ్‌ రమేష్‌, కేసీ వేణుగోపాల్‌ మాత్రమే హాజరు కానున్నారు. 

దిగ్విజయ్‌ సింగ్‌, పీ చిదంబరం ఇద్దరిలో ఒకరిని రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని తొలుత కాంగ్రెస్‌ భావించినందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ఇద్దరినీ రేపటి భేటీకి ఆహ్వానించకపోవడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. ఈ మినహాయింపు కేవలం ఖర్గేకు మాత్రమే పరిమితం కాలేదు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అధిరంజన్‌ చౌదరీ.. బెంగాల్‌ పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఇక సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ కూడా రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌గా, కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌గా కొనసాగుతున్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top