డీఎంకేపై కమల్‌ ఫైర్‌ 

Makkal Needhi Maiam Kamal Haasan Fires On DMK - Sakshi

కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతుకు బీజేపీ కుట్ర 

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అడ్రస్సే కాదు, నామ రూపాలు లేకుండా చేయడానికి బీజేపీ ఆదేశాల మేరకు డీఎంకే కుట్ర పన్నిందని మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌ ఆరోపించారు. బీజేపీకి బీ–టీం తాను కాదని, డీఎంకే అని పేర్కొన్నారు. కొళత్తూరులో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో డీఎంకేపై కమల్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మక్కల్‌ నీది మయ్యం నిజాయితీ పరుల గుడారంగా మారినట్టు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో, మార్పు లక్ష్యంగా తనతో చేతులు కలిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలు దొందుదొందే అని, ఈ రెండు పారీ్టలు ఇక్కడి పేద ప్రజల్ని మరింత పేదరికంలోకి నెట్టారని, రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినట్టు ధ్వజమెత్తారు. ఈ ప్రజలు జీవన స్థితి పెంపు, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే మార్పు పయనంలో ఉన్న తనను కొనేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “కమల్‌ నాట్‌ ఫర్‌సేల్, తమిళనాడు నాట్‌ ఫర్‌ సేల్‌ అంటూ ఓటు కూడా నాట్‌ ఫర్‌ సేల్‌ అని అవినీతిపరులకు బుద్ధి చెప్పే రీతిలో తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  

నాకు కాషాయం రంగు.. 
అవినీతిరహిత పాలన, ప్రజా సంక్షేమం, మార్పు నినాదంతో తాను ముందుకు సాగుతుంటే, తనకు కాషాయం రంగు పులిమేయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు చేస్తున్న డీఎంకే వాళ్లే బీజేపీ వ్యూహాలను తమిళనాడులో రహస్యంగా అమలు చేస్తున్నారని  ధ్వజమెత్తారు. ఆ పార్టీ రంగు ప్రస్తుతం బయటపడుతోందని, మరి కొద్ది రోజుల్లో బీజేపీతో వారికి ఉన్న రహస్య ఒప్పందం బయటపడడం ఖాయం అని వ్యాఖ్యానించారు. అందుకే సీట్ల పంపకాల పేరిట కాంగ్రెస్‌ను కూటమి నుంచి సాగనంపే ప్రయత్నాల్లో డీఎంకే ఉన్నట్టు ఆరోపించారు.  

దేశంలోనే కాంగ్రెస్‌ను నామ రూపాలు లేకుండా చేయాలన్న కాంక్షతో ఉన్న కేంద్రం, తాజాగా తమిళనాడులో డీఎంకే ద్వారా వ్యూహాలకు పదును పెట్టినట్టు పేర్కొన్నారు. డీఎంకే కుట్రలను పరిగణించి కాంగ్రెస్‌ మేల్కుంటే మంచిదని, లేని పక్షంలో తీవ్ర నష్టం ఆ పారీ్టకే అని హెచ్చరించారు. మక్కల్‌ నీది మయ్యం ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయం అని, అన్నాడీఎంకే అసంతృప్తి వాదులు, డీఎంకే వ్యతిరేకులు ఎన్నికల సమయానికి తన వెన్నంటి పెద్ద ఎత్తున  రావడం ఖాయమని, తద్వారా వచ్చే ఓట్లతో అధికార పీఠాన్ని మక్కల్‌ నీది మయ్యం కైవసం చేసుకుని తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top