మా లాయర్లతో సినిమా తీయండి! | Make A Good Movie, You Can Restore Your Image Says CJI To Rajpal Yadav | Sakshi
Sakshi News home page

మా లాయర్లతో సినిమా తీయండి!

Oct 8 2026 4:55 AM | Updated on Oct 8 2026 4:55 AM

Make A Good Movie, You Can Restore Your Image Says CJI To Rajpal Yadav

బాలీవుడ్‌ కమెడియన్‌కు సుప్రీం సూచన 

చెక్‌ బౌన్సు కేసుల విచారణ 

పరిగణలోకి రూ.1.15 కోట్ల చెల్లింపు  

కోట్లు నష్టపోయానన్న రాజ్‌పాల్‌ యాదవ్‌ 

ఇంకో సినిమా తీయండన్న సీజేఐ

న్యూఢిల్లీ: ‘ఇంకో మంచి సినిమా తీయండి... ప్రజలకు వినోదం పంచండి. మీ ఇమేజీని పునరుద్ధురించుకోండి’. బాలీవుడ్‌ కమెడియన్‌ రాజ్‌పాల్‌ యాదవ్‌కు దేశ అత్యన్నత న్యాయస్థానం ఇచ్చిన సలహా ఇది. చెక్‌ బౌన్స్‌ కేసుల్లో రాజ్‌పాల్‌ యాదవ్‌ రూ.1.15 కోట్ల మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీకి చెల్లించడాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. 

సుమారు ఏడు చెక్‌ బౌన్స్‌ కేసుల్లో రాజ్‌పాల్‌ యాదవ్‌ కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన బెంచ్‌ కొన్ని రోజుల క్రితం రాజ్‌పాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. తాజాగా బుధవారం ఈ అంశంపై బెంచ్‌ విచారణ చేపట్టగా రాజ్‌పాల్‌ యాదవ్‌ స్వయంగా కోర్టుకు హాజరై తనదైన శైలిలో వివరణ ఇచ్చుకున్నారు.

 ‘‘సర్‌. దండం పెడుతున్నా... పదమూడేళ్లలో 200 – 250 సినిమాల్లో నటించాను. అలాగే రూ.200 – 250 కోట్లు నష్టపోయాను కూడా. ‘‘అతా పతా లాపతా’’ సినిమాతో రూ.17 కోట్లు గంగలో కలిసిపోయింది. నన్ను ఎప్పుడైనా, ఎక్కడికైనా పంపించండి. నేను రెడీ’’ అని పరిస్థితిని వివరించారు. ‘‘నాకు వ్యతిరేకంగా ఒక ప్రెస్‌మీట్‌ పెట్టారు. సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు. 1200 థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా. ఒక్కదాంట్లోనూ కాకుండా చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ దశలో సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా కొత్త సినిమా వస్తోందా? మంచి సినిమా ఒకటి తీసి మళ్లీ ఒకసారి వినోదాన్నివ్వండి. ఈ ఇమేజీ కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ మా న్యాయవాదుల్లోనూ కొందరు మంచి నటులున్నారు. వాళ్లతో సినిమా తీయండి’’ అని చమత్కరించారు. కేసు విచారణ ఇప్పుడు వచ్చే వారానికి వాయిదా పడింది. 

రాజ్‌పాల్‌ యాదవ్‌ చెక్‌ బౌన్స్‌ల వ్యవహారం మొత్తం 2010లో మొదలైంది. సొంత దర్శకత్వంలో తీయాలనుకున్న ‘అతా పతా లాపతా’ సినిమా కోసం రాజ్‌పాల్‌ మెస్సర్స్‌ ముర్లీ ప్రాజెక్ట్స్‌ అనే సంస్థ నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు రాజ్‌పాల్‌ రూ.1.05 కోట్ల చెక్కులు ఏడు ఆ సంస్థకు ఇచ్చారు. అయితే ఇవన్నీ బ్యాంకులో బౌన్స్‌ అయ్యాయని ముర్లీ ప్రాజెక్ట్స్‌ ఆరోపిస్తోంది. ఒప్పందం ప్రకారం రాజ్‌పాల్‌ దంపతులు, వారి కంపెనీ వడ్డీతో కలిపి రూ.11 కోట్లు చెల్లించాలి. 

చెక్‌ బౌన్సు కావడంపై ఆ సంస్థ కోర్టుకెక్కడంతో జూలై 10న ఢిల్లీ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. మూడు నెలల శిక్ష విధించింది. ఐదేళ్లు ఆలస్యంగా అసాధారణంగా కేసులు వేయడాన్ని కూడా తప్పుపట్టలేదు. భార్య రాధా రాజ్‌పాల్‌ యాదవ్‌పై కూడా ఒక్కో చెక్కుకు రూ.5.5 లక్షల చొప్పున జరిమానా విధించిన హైకోర్టు జరిమానా చెల్లించకపోతే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్‌పాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అతడి అరెస్ట్‌ను కొంతకాలం నిలువరించినా రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement