కోరలు చాస్తున్న బ్లాక్‌ ఫంగస్: 16 మంది మృతి

Maharashtra: Mucormycosis Kills 16 In Aurangabad - Sakshi

ఔరంగాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడి వారి ప్రాణాలను తీస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా కల్లోలం రేపుతుంటే ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌తో ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 201 మందికి ఆ ఫంగస్‌ రాగా వారిలో 16 మంది మృతి చెందడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది.

ఈ ఏడాదిలో కరోనా కేసులు పరిశీలించగా వారిలో 201 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని ఔరంగాబాద్‌ మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని అధికారులు ఓ నివేదికలో వివరించారు. ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైద్యాధికారి డాక్టర్‌ నీతా పడాల్కర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు గుర్తించేందుకు కరోనా బాధితుల వివరాలు పరిశీలించాం. కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్‌ వాడిన వారు, మధుమేహులకు బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడుతుందని మేం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం (ఈఎన్‌టీ, దంత, కంటి వైద్యులు) గుర్తించింది. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలను గుర్తించి వారికి ప్రత్యేక వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారికి కావాల్సిన మందులు కూడా అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top