
మధ్యప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్ నిర్వాకం
12 ఏళ్ల తర్వాత వెలుగు చూసిన వైనం
భోపాల్: ఓ కానిస్టేబుల్ 12 ఏళ్లపాటు ఎన్నడూ డ్యూటీ చేయకుండానే ఏకంగా రూ.28 లక్షల మేర వేతనం అందుకున్నాడు. వ్యవస్థ వైఫల్యం, యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ విడ్డూరం మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. 2011లో ఓ వ్యక్తి కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాడు. భోపాల్ పోలీస్ లైన్స్‌లో పోస్టింగ్ సైతం ఇచ్చారు.
కొన్ని రోజులకే ఆ బ్యాచ్‌లో మిగతా వారితో కలిపి అతడిని కూడా సాగర్ పోలీస్ ట్రెయినింగ్ సెంటర్‌కు ప్రాథమిక శిక్షణ కోసం పంపించారు అధికారులు. ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లకుండా, నేరుగా విదిశలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సెలవు కోరడం వంటివేమీ లేకుండా ఇంట్లోనే ఉండిపోయాడు.
స్పీడ్ పోస్ట్ ద్వారా సర్వీస్ రికార్డును పోస్టింగిచ్చిన భోపాల్ పోలీస్ లైన్స్ స్టేషన్‌కు పంపించాడు. వాటిని అందుకున్న అధికారులు అందులోని వివరాలను, అతడి హాజరీని, శిక్షణ స్టేటస్‌ను గురించిన వివరాలనుగానీ చూడనే లేదు. అది మొదలు అతడిని కొత్తగా రిక్రూటైన కానిస్టేబుల్‌గా పరిగణిస్తూ నెలనెలా ఠంచనుగా బ్యాంకు అకౌంట్‌లో వేతనం జమ చేస్తున్నారు. ట్రెయినింగ్ సెంటర్ అధికారులు గానీ, భోపాల్ పోలీస్ లైన్స్‌లో గానీ అతడిని ఎవరూ పట్టించుకోలేదు. ఇలా 12 ఏళ్లు గడిచాక 2023లో అసలు విషయం వెలుగు చూసింది.
2011వ బ్యాచ్ వారికి పే గ్రేడ్ ఎవాల్యుయేషన్ సమయంలో అతడిని గురించి వాకబు చేయగా తామెన్నడూ చూడలేదని, ఎక్కడ పనిచేస్తున్నాడో తెలియదని చెప్పడంతో అవాక్కవడం అధికారుల వంతయింది. ఈ వ్యవహారంపై ఏసీపీ అంకితా ఖటెర్కర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆ కానిస్టేబుల్‌కు నోటీసులు పంపారు. విచారణకు హాజరైన అతగాడు తనకు మానసిక సమస్యలున్నాయని చెప్పాడు. ఇందుకు ఆధారాలను సమర్పించాడు. ప్రస్తుతం భోపాల్ పోలీస్ లైన్స్‌లోనే పనిచేస్తున్న ఇతడు రూ.1.5 లక్షలను తిరిగిచ్చేశాడు. మిగతా మొత్తాన్ని శాలరీ నుంచి ఇచ్చేందుకు అంగీకరించాడని ఏసీపీ అంకిత వివరించారు.