Chandni Chandran: అప్పటికింకా మాకు పెళ్లి కాలేదు.. కానీ ఆ ఫొటో!

Lovely Story Behind IAS Officer Pic: She Says We Were Not Married Then - Sakshi

అగర్తలా: సాధారణంగా పరీక్షలు రాయడం పూర్తి కాగానే విద్యార్థులు ఉపశమనం దొరికినట్లు ఫీలవుతారు. అదే విధంగా.. ఫలితాలు ఎప్పుడు వస్తాయో, పాస్‌ అవుతామో లేదో అన్న భయాలతో ఒత్తిడికి కూడా గురిఅవుతారు. అటువంటి సమయాల్లో నచ్చిన పని చేస్తూ సేద దీరడం లేదంటే, సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఐఏఎస్‌ అధికారిణి చాందినీ చంద్రణ్‌ కూడా ఇందుకు అతీతం కాదు. 2015లో ఆమె సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాశారు. 

ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒత్తిడికి లోనైన చాందినీ.. తన ప్రియ మిత్రుడు అరుణ్‌ సుదర్శన్‌తో కలిసి సరాదాగా ఔటింగ్‌కి వెళ్లారు. సరిగ్గా అప్పుడే వర్షం పడింది. ఒకే గొడుగు కింద ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. అరుణ్‌ సుదర్శన్‌ ఆమె భుజంపై ఆత్మీయంగా చేయి వేసి ముందుకు నడిపిస్తుండగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తున్నారు. అప్పుడే ఓ ఫొటో జర్నలిస్టు కెమెరాను క్లిక్‌ మనిపించారు. ఇంకేముంది.. తర్వాతి రోజు పత్రికలో.. ‘‘వేసవివి సెలవు.. రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది’’ అంటూ చాందినీ చంద్రణ్‌, అరుణ్‌ సుదర్శన్‌ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఇందుకు జతచేసి పబ్లిష్‌ చేశారు. 

అయితే, కాకతాళీయంగా అదే రోజు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఆ యేడు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఫొటోలతో పాటు మరో పేజీలో చాందినీ చంద్రణ్‌(ఆమె అప్పుడు ఉత్తీర్ణురాలు కాలేదు) ఫొటో కూడా పబ్లిష్‌ కావడం గమనార్హం. దీంతో.. అరుణ్‌ సుదర్శన్‌... సదరు పత్రికా సంస్థకు ఫోన్‌ చేసి, తమ ఫొటో ఎందుకు వేశారని నిలదీశారు. సదరు ఫొటోగ్రాఫర్‌తో మాట్లాడి ఇలాంటి ఫొటోలు అనుమతి లేకుండా పబ్లిష్‌ చేయవద్దని హితవు పలికారు. ఈ విషయాన్ని మంగళవారం ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఐఏఎస్‌ చాందినీ చంద్రణ్‌ గత జ్ఞాపకాలకు గుర్తు చేసుకున్నారు. 

అప్పటికి మాకింకా పెళ్లికాలేదు
‘‘ఇందులో చట్టవిరుద్ధమైనది ఏమీ లేదు!! కానీ అలాంటి ఫొటోలు ఇంట్లో వాళ్లకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి కదా. ఎందుకంటే.. అప్పటికి మాకింకా పెళ్లి కాలేదు. అయితే, ప్రస్తుతం మేం వివాహం చేసుకున్నాం. ఇటీవలే ఈ ఫొటో గురించి గుర్తుకు రాగా.. అరుణ్‌ సుదర్శన్‌ సదరు ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించగా... ఆ ఫొటోకాపీని మాకు పంపించారు. ఇందుకు కేవలం థాంక్స్‌ అనే మాటతో సరిపెట్టలేను!!’’ అని ఈ స్టోరీని రివీల్‌ చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. 

ఈ క్రమంలో..  ‘‘అత్తుత్తమ ఫొటోల్లో ఇది ఒకటి!! మధుర జ్ఞాపకాలు. ఏంటో.. ఊహించనవి అలా అప్పుడప్పుడూ అలా జరిగిపోతూ ఉంటాయి. పాత ఫొటో అయినా ఇది మీకెంతో ప్రత్యేకం కదా’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐఐటీ మద్రాస్‌లో విద్యనభ్యసించిన చాందినీ చంద్రణ్‌ 2017లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె.. ఉత్తర త్రిపురలోని కాంచన్‌పూర్‌లో సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top