Lok sabha elections 2024: ‘రాజ’సం ఎవరిదో...! | Lok sabha elections 2024: BJP vs Congress in Lok Sabha Polls | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: ‘రాజ’సం ఎవరిదో...!

Published Tue, Apr 9 2024 5:42 AM | Last Updated on Tue, Apr 9 2024 10:56 AM

Lok sabha elections 2024: BJP vs Congress in Lok Sabha Polls - Sakshi

రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా నేనా?

రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌

ఈసారి హ్యాట్రిక్‌ లక్ష్యంగా బరిలోకి

‘మేనిఫెస్టో మేజిక్‌’పైనే కాంగ్రెస్‌ ఆశలు

గహ్లోత్‌–పైలట్‌ విభేదాలతో గుబులు

స్టేట్‌ స్కాన్‌

రాజస్థాన్‌లో రాజకీయ పోరు దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారమూ ఈ రెండు పార్టీల మధ్యే మారుతూ వస్తోంది. కమలనాథులు హిందుత్వ, ఆర్థికాభివృద్ధిపైనే ఫోకస్‌ చేస్తుండగా సంక్షేమ హామీలు, మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను కాంగ్రెస్‌ నమ్ముకుంటోంది.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో కాంగ్రెస్‌ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో లోక్‌సభ బరిలోకి దిగుతోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలో క్లీన్‌స్వీప్‌ చేసి హ్యాట్రిక్‌ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో పుంజుకుని ఎలాగైనా సత్తా చాటే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ తలమునకలుగా ఉంది...     

పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, హిందుత్వ సిద్ధాంత దన్నుతో రాజస్థాన్‌ బీజేపీ బలమైన పునాదులు వేసుకుంది. తొలుత భైరాన్‌సింగ్‌ షెకావత్, అనంతరం వసుంధరా రాజె సింధియా వంటివారి నాయకత్వమూ పారీ్టకి కలిసొచి్చంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బాగా పట్టుంది. కాంగ్రెస్‌ కూడా రాష్ట్రంలో బలమైన శక్తిగా కొనసాగుతోంది. అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌ వంటి నాయకుల సారథ్యానికి తోడు గ్రామీణ ఓటర్ల మద్దతు పారీ్టకి పుష్కలంగా ఉంది. ఈ ఎడారి రాష్ట్రంలో 25 లోక్‌సభ సీట్లున్నాయి. 4 ఎస్సీలకు, 3 ఎస్టీలకు        కేటాయించారు.

బీజేపీకి బేనీవాల్‌ బెంగ!
2014 లోక్‌సభ ఎన్ని కల్లో మొత్తం 25 సీట్లనూ ఎగరేసుకుపోయిన బీజేపీ 2019లో సైతం క్లీన్‌స్వీప్‌ చేసింది. 24 సీట్లను బీజేపీ, మిగతా ఒక్క స్థానాన్ని ఎన్డీఏ మిత్రపక్షం            రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) గెలుచుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. అదే ఊపులో లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి క్లీన్‌స్వీప్‌ చేయాలని తహతహలాడుతోంది.

అందుకు తగ్గట్టే ప్రచారాన్ని మోదీ పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్‌ అంటేనే వారసత్వ రాజకీయాలు, అవినీతికి పెట్టింది పేరంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న హనుమాన్‌ బేనీవాల్‌ సారథ్యంలోని ఆర్‌ఎల్‌పీ ఈసారి కాంగ్రెస్‌తో జతకట్టడం కమలం పార్టీకి కాస్త ప్రతికూలాంశమే.

జాట్‌ నేత అయిన బేనీవాల్‌కు ఉన్న ఆదరణ షెకావతీ, మార్వార్‌ ప్రాంతాల్లో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయవచ్చంటున్నారు. పార్టీ తరఫున కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌ (జోధ్‌పూర్‌), అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ (బికనేర్‌), లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (కోట) వంటి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. నలుగురు సిట్టింగులకు బీజేపీ మొండిచేయి చూపడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి.

దీనికి తోడు కాంగ్రెస్‌ నుంచి జంప్‌ చేసిన ఇద్దరు నేతలకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరిలో బలమైన గిరిజన నేతగా పేరున్న మహేంద్రజీత్‌సింగ్‌ మాలవీయ ఉన్నారు. పారాలింపిక్స్‌లో పసిడి సాధించిన పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత దేవేంద్ర ఝజారియాకు బీజేపీ అనూహ్యంగా చురు టికెటిచ్చింది. వసుంధరా రాజె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ ఝలావర్‌–బరన్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌లో అదే వర్గ పోరు  
ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు సార్వత్రిక సమరంలో నెగ్గుకురావడం సవాలే. మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌ మధ్య వర్గ పోరు మళ్లీ రాజుకుంటుండటం తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల్లో గహ్లోత్‌ ఓటమి నేపథ్యంలో రాష్ట్ర పారీ్టపై పూర్తిగా పట్టు బిగించే వ్యూహాల్లో పైలట్‌ వర్గం ఉంది. జాలోర్‌ నుంచి గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ బరిలో ఉన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు న్యాయాలు, 25 గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది.

కుల గణన, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధత హామీల ద్వారా పేదలు, మధ్య తరగతి వర్గాలు, కారి్మకులు, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని రాహుల్‌ చెబుతున్నారు. ఆర్‌ఎల్‌పీ ఈసారి ఇండియా కూటమిలోకి రావడం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. జాట్లలో బాగా ఆదరణ ఉన్న బెనీవాల్‌ ప్రభావం షెకావతీ, మార్వార్‌ ప్రాంతాల్లో... ముఖ్యంగా నాగౌర్, సికర్, ఛురు, జుంఝును వంటి లోక్‌సభ స్థానాల్లో కలిసొస్తుందని పార్టీ ఆశలు పెట్టుకుంది.

కుల సమీకరణాలు కీలకం
రాజస్థాన్‌ రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర. ప్రధానంగా జాట్లు, రాజ్‌పుత్‌లు, మీనాలు, గుజ్జర్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతున్నారు. 10% జనాభా ఉన్న జాట్‌ వర్గానికి మార్వార్, షెకావతీ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. రాష్ట్ర జనాభాలో రాజ్‌పుత్‌ల వాటా 6–8%. రాజ కుటుంబీకులైన వసుంధరా రాజె, భైరాన్‌ సింగ్‌ షెకావత్‌ సీఎం పదవి చేపట్టినవారే.

జాట్లు అప్పుడప్పుడూ ఊగిసలాడినా రాజ్‌పుత్‌ల మద్దతు కమలనాథులకు దండిగా ఉంటుందని గత ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. 5 శాతమున్న గుజ్జర్లు గతంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. వారిప్పుడు బీజేపీ వైపు మళ్లవచ్చంటున్నారు.

రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గం 8% దాకా ఉంది. అగ్రవర్ణ పార్టీగా పేరొందిన బీజీపీ అనూహ్యంగా బ్రాహ్మణుడైన భజన్‌లాల్‌ శర్మను సీఎం చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీపీ జోషిదీ ఇదే సామాజికవర్గం. ఇక ఎస్టీ సామాజిక వర్గమైన మీనాలు జనాభాలో 5% ఉన్నారు. వీరికి తూర్పు రాజస్థాన్‌లో పట్టుంది. 18% ఉన్న ఎస్టీ సామాజిక వర్గంలోని ఉప కులాలు పరిస్థితులను బట్టి ఇరు  పారీ్టలకూ మద్దతిస్తున్నారు. కాంగ్రెస్‌ కుల గణన హామీ ప్రభావం చూపవచ్చంటున్నారు.

సర్వేలు ఏమంటున్నాయి...
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందీ బెల్ట్‌లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఘన విజయం సాధించడం ఆ పార్టీలో ఫుల్‌ జోష్‌ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ క్వీన్‌స్వీప్‌ చేస్తుందని, కాంగ్రెస్‌కు వైట్‌వాష్‌ తప్పదని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో 25 సీట్లనూ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా బీజేపీ హ్యాట్రిక్‌ కొడుతుందనేది మెజారిటీ ఒపీనియన్‌ పోల్స్‌ అభిప్రాయం.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement