Lok Sabha Election 2024: లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ

Published Sun, May 19 2024 5:00 AM

Lok Sabha Election 2024: Triangular contest in Ladakh

ఒకప్పుడు జమ్మూకశ్మీర్లో భాగమైన లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారాక స్థానికంగా పరిణామాలు ఎన్నో మలుపులు తీసుకున్నాయి. భిన్న ధ్రువాలుగా ఉండే బౌద్ధులు–ముస్లింలు ఇప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పోరాడుతున్నారు. లేహ్‌లో బౌద్ధులు ఎక్కువ. కార్గిల్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. వీరంతా తమ ప్రయోజనాలను పరిరక్షించాలని, తమ డిమాండ్లకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చోటు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం కావడంతో.. తమకూ జమ్మూ కశీ్మర్‌ మాదిరిగా రాజకీయ అవకాశాలు కలి్పంచాలన్నది వీరి ప్రధాన డిమాండ్లలో ఒకటి. కేంద్రపాలిత ప్రాంతంగా మారాక లేహ్‌ కేంద్రంగా పనిచేసే సామాజిక, రాజకీయ సంస్థలన్నీ కలసి లేహ్‌ అపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ)గా ఏర్పడ్డాయి. కార్గిల్‌ కేంద్రంగా పనిచేసే సామాజిక, మత, రాజకీయపరమైన సంస్థలన్నీ కలసి కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (కేడీఏ)గా అవతరించాయి. ఈ రెండూ కొన్నేళ్లుగా డిమాండ్ల సాధనకు కలసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌ లోక్‌సభ స్థానానికి ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.     

విజయం ఎవరిని వరించేనో? 
లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది బీజేపీ సిట్టింగ్‌ స్థానం. ఈసారి సిట్టింగ్‌ ఎంపీ జామ్యంగ్‌ సేరింగ్‌ నామ్‌గ్యాల్‌ బదులు తాషి గ్యాల్సన్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ఇక్కడ బాగా ఉంది. దాంతో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ ఈ ప్రయోగం చేసింది. గ్యాల్సన్‌ లద్దాక్‌ ఆటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో నామ్‌గ్యల్‌ స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగాలని యోచించినా అధినాయకత్వం జోక్యంతో వెనక్కు తగ్గారు. గ్యాల్సన్‌కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 2014లోనూ లద్దాఖ్‌లో బీజేపీయే గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తుప్‌స్టాన్‌ చెవాంగ్‌ కేవలం 36 ఓట్ల ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి గులామ్‌ రాజాపై నెగ్గారు. చెవాంగ్‌ 2009 
ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 

విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్‌ స్థానాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌; ఉదంపూర్, లద్దాఖ్, జమ్మూల్లో కాంగ్రెస్‌ పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. కానీ కార్గిల్‌ ఎన్‌సీ నాయకత్వం అధిష్టానం నిర్ణయంతో విభేదించింది. హాజీ హనీఫా జాన్‌ను లద్దాక్‌లో పార్టీ అభ్యర్థిగా పోటీకి దింపింది. కాంగ్రెస్‌ కూడా సేరింగ్‌ నామ్‌గ్యల్‌ను అభ్యరి్థగా ప్రకటించింది. కానీ కార్గిల్‌ కాంగ్రెస్‌ నాయకులు కూడా అనూహ్యంగా హాజీ హనీఫాకే మద్దతు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్, ఎన్‌సీలకు ఏం చేయాలో పాలుపోలేదు. 

చివరికి ఇండియా కూటమి తరఫున సేరింగ్‌ నామ్‌గ్యల్‌ను అధికారిక అభ్యర్థిగా రెండు పారీ్టలూ ప్రకటించాయి. అలా బీజేపీ నుంచి గ్యాల్సన్, కాంగ్రెస్‌–ఎన్‌సీ ఉమ్మడి అభ్యరి్థగా సేరింగ్‌ న్యామ్‌గల్, ఆ రెండు పారీ్టల స్థానిక నేతల మద్దతుతో హాజీ హనీఫా పోటీలో ఉన్నారు. వీరిలో హనీఫా ఒక్కరే కార్గిల్‌ వాసి. మిగతా ఇద్దరూ లేహ్‌కు చెందిన వారు. దీంతో గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కార్గిల్, లేహ్‌ వాసులు ఎప్పటి మాదిరే భిన్నమైన తీర్పు ఇస్తారేమో చూడాలి. ఇదే కారణంతో లద్దాఖ్‌ను కార్గిల్, లేహ్‌ రెండు లోక్‌సభ స్థానాలుగా విడగొట్టాలని ఎల్‌ఏబీ, కేడీఏ డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఓటర్లు తక్కువ 
1,73,266 చదరపు కిలోమీటర్లతో విస్తీర్ణపరంగా లద్దాఖ్‌ దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గం. కానీ ఓటర్లు మాత్రం కేవలం 1,82,571 మందే! గత మూడు లోక్‌సభ ఎన్నికలుగా ఇక్కడ 71 శాతానికి పైనే ఓటింగ్‌ నమోదవుతోంది.

స్థానికుల డిమాండ్లు
లద్దాక్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చడంతో పాటు ప్రత్యేక పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్, రెండు లోక్‌సభ స్థానాలు స్థానికుల డిమాండ్లు. ఆరో షెడ్యూల్‌లో చేరుస్తామని బీజేపీ 2019 మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ కింద సాంస్కృతిక, స్థానిక గుర్తింపుల పరిరక్షణకు స్వతంత్ర మండళ్ల ఏర్పాటు కూడా ఒక డిమాండ్‌. లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్‌ కేంద్రంగా రెండు స్వతంత్ర మండళ్లు ఇప్పటికే ఉన్నా అవి 1995 చట్టం కింద ఏర్పాటైనవి.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
 
Advertisement