Rahul Gandhi: మహిళలంటే చిన్నచూపు! | Sakshi
Sakshi News home page

Rahul Gandhi: మహిళలంటే చిన్నచూపు!

Published Fri, May 24 2024 4:51 AM

Lok Sabha Election 2024: BJP believes women should be treated as second-class citizens says Rahul Gandhi

వారిని ఆర్‌ఎస్‌ఎస్‌ ‘శాఖ’లోకి అనుమతించట్లేదు

 బీజేపీపై రాహుల్‌ గాంధీ ఆరోపణ 

న్యూఢిల్లీ: మహిళలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగానే చూస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ పార్టీ అభ్యర్థి ఉదిత్‌ రాజ్‌ తరఫున గురువారం ఢిల్లీలోని మంగోల్‌పురిలో మహిళలు మాత్రమే పాల్గొన్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ఎంతో ఆర్భాటంగా ఇప్పుడే మహిళాలోకం కలలు సాకారం చేస్తున్నట్లు పార్లమెంట్‌లో నారీశక్తి వందన్‌ అధినయమ్‌(మహిళా రిజర్వేషన్‌ బిల్లు) ప్రవేశపెట్టారు.

 ఆ చట్టం ఇప్పుడు కాదు ఏకంగా పదేళ్ల తర్వాత అమలుచేస్తామని తీరిగ్గా చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ఒక సిద్దాంతముంది. అదే ఆర్‌ఎస్‌ఎస్‌. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అయితే ఏకంగా మహిళలను కనీసం ‘శాఖ’లోకి అడుగుపెట్టనివ్వడంలేదు. మహిళలను రెండో తరగతి పౌరులుగా భావించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నరనరాల్లో నాటుకుపోయింది’ అని విమర్శలు గుప్పించారు. 

వర్కింగ్‌ ఉమెన్‌ పనికి గుర్తింపు దక్కట్లేదు 
‘‘భారత్‌లో ప్రతీ రంగం గురించి మాట్లాడతాంగానీ వర్కింగ్‌ ఉమెన్‌ ఇంట్లోనూ చేసే శ్రమకు ఎక్కడా గుర్తింపు దక్కట్లేదు. రోజంగా ఆఫీస్‌/కార్యస్థలంలో పనిచేసి అలసిపోయిన మహిళలు ఇంటికొచ్చాక మళ్లీ రెండో షిప్ట్‌ మొదలెడతారు. పిల్లల ఆలనాపాలనా చూసుకుని ఇంటి పనులన్నీ చేస్తారు. ఈ పనికి వాళ్లకు ఎలాంటి చెల్లింపులు ఉండవు. పురుషులు రోజుకు 8 గంటలు పనిచేస్తే మహిళలు 16 గంటలపైనే పనిచేస్తారు. 

వారి శ్రమకు ప్రతిఫలంగా ఏమీ దక్కట్లేదు. ఇది ఒక రకంగా చెల్లింపులులేని గుర్తింపులేని పని. మేం అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏటా రూ.1 లక్ష వారి ఖాతాలో జమచేస్తాం’’ అని రాహుల్‌ అన్నారు. మే 25నాటి పోలింగ్‌కు ప్రచారం గురువారంతో ముగుస్తుండటంతో ఢిల్లీ మెట్రోలోనూ రాహుల్‌ ప్రయాణించారు. ‘‘నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ తరఫున సైతం రాహుల్‌ దిల్షాద్‌ గార్డెన్‌ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నారు. 

ఏపీ భవన్‌లో మధ్యాహ్న భోజనం 
ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన రాహుల్‌ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ భవన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌సహా దాదాపు 10 మందితో కలిసి రాహుల్‌ భోజనం చేశారు. రాహుల్‌ పూరీలు, చపాతీలు, కోడికూర వేపుడు, రొయ్యల వేపుడు ఆర్డర్‌ ఇచ్చారు. తొలుత పూరీ/చపాతీని పప్పుతో కలిపి తిన్నారు. తర్వాత చికెన్‌ ఫ్రై, రొయ్యల ఫ్రైతో చపాతీ/పూరీ తిన్నారు.

మీ కీలక పాత్ర పోషించండి...సోనియా గాంధీ 
ఢిల్లీ పరిధిలో ప్రచారం చివరిరోజు సందర్భంగా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఓటర్లకు ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న కీలక ఎన్నికలివి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగబద్ధ సంస్థలపై దాడులు కొనసాగుతున్న వేళ వచి్చన ఎన్నికలివి. ఈ పోరాటంలో మీరు మీ కీలక పాత్ర పోషించండి. మీ ఓటు ఉపాధి కల్పనకు బాటలువేస్తుంది. ఎగసిన ధరలను కిందకు దింపుతుంది. మహిళలకు సాధికారతను కట్టబెడుతుంది. మెరుగైన భవిష్యత్తుతో సమానత్వాన్ని సాధిస్తుంది. ఢిల్లీ పరిధిలోని ఏడు ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అని సోనియా సందేశమిచ్చారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement