
వీడ్కోలు సమావేశంలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా
న్యూఢిల్లీ: న్యాయ విచారణలో ప్రక్రియలో సంక్షిప్తంగా, సూటిగా ఉండే పిటిషన్ల అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నొక్కిచెప్పారు. డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు. పిటిషన్లు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండటం లాయర్లేకాదు, జడ్జీలకు కూడా ప్రయోజనకరమని చెప్పారు.
ఈ నెల 13వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా శుక్రవారం తనకు సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్‌సీఏవోఆర్‌ఏ) ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. 14వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ ఖన్నా తన పదవీ కాలంలో పారదర్శకతను, సమ్మిళితత్వాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. సుప్రీంకోర్టులో ఆడ్వొకేట్స్ ఆన్ రికార్డు ఎంతో కీలకమైన వారని, అత్యున్నత న్యాయస్థానానికే కాదు, దేశంలోని పౌరులందరికీ ప్రతినిధులంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా కొనియాడారు.
అయితే, తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పగలిగే డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించలేకపోవడం ఇంకా తనకు లోటుగానే అనిపిస్తోందని చెప్పారు. క్లుప్లంగా ఉండే ఫైళ్లను చదవడం కూడా చాలా తేలికని చెప్పారు. ఫైల్ చదివిన తర్వాత ఆకేసుపై సగం వరకు పట్టు దొరుకుతుందని జస్టిస్ ఖన్నా అన్నారు. సీనియర్లపై ఆధారపడకుండా కోర్టుల్లో కేసులను వాదించాలని న్యాయవాదులకు సూచించారు. ‘కక్షి దారులతో మాట్లాడేది మీరు. కక్షిదారులు మాట్లాడేది కూడా మీతోనే. నోట్స్ తయారు చేసేదీ మీరే. ఆ సారాంశాన్ని సీనియర్లకు వివరిస్తారు.
కోర్టులో మీరే ఎందుకు వాదించరు?’అని జస్టిస్ ఖన్నా తెలిపారు. సంబంధిత విషయ పరిజ్ఞానం కలిగి ఉండటం లాయర్లకు ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పారు. సుప్రీంకోర్టు కాకున్నా, మిగతా కోర్టుల్లో కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ప్రస్తుతం ముఖ్యమైన విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్ మీడియేషన్ ట్రెయినింగ్ కోర్సుకు ఎంతో ఆదరణ లభిస్తోందని వివరించారు. దీని వల్ల అమూల్యమైన సమయం ఆదా అవుతుందని తెలిపారు. రిటైరయ్యాక సాయం కావాల్సిన వారు మొహమాటం లేకుండా తన వద్దకు రావచ్చని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు.