ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి.. | Kurukshetra MP Naveen Jindal Reintroduced Borewell Boy Prince After 20 Years | Sakshi
Sakshi News home page

ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి..

Apr 21 2026 12:15 PM | Updated on Apr 21 2026 1:59 PM

Kurukshetra MP Naveen Jindal Reintroduced Borewell Boy Prince After 20 Years

ఆదివారం ఆటవిడుపులో భాగంగా.. కురుక్షేత్ర ఎంపీ నవీన్‌ జిందాల్‌ సరదాగా పోలో మ్యాచ్‌ ఆడారు. ఆరు గోల్స్‌ చేసి కురక్షేత్ర టీం కెప్టెన్‌గా విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు కూడా. అయితే మ్యాచ్‌ మధ్యలో సోషల్‌ మీడియాలో లైవ్‌ ఇచ్చి.. ఓ పాతికేళ్ల కుర్రాడిని పరిచయం చేసి దేశం దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.

నవీన్‌ జిందాల్‌తో ఉన్న ఆ యువకుడి పేరు ప్రిన్స్‌. ఆర్మీలో చేరాలనే కసితో పరీక్షలు రాశాడు. కానీ, ఎత్తు రూపంలో అతని కల చెదిరిపోయింది. ఐటీఐ కోర్స్‌ పూర్తి చేసిన​ ప్రిన్స్‌.. ప్రస్తుతం అంబాల నగరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే అతనిలో అంత ప్రత్యేకత ఏముందా? అనుకుంటున్నవాళ్లకు నవీన్‌ జిందాల్‌ ఆ కుర్రాడితోనే అసలు విషయం చెప్పించాడు.

అది 2006 జులై 21.. కురుక్షేత్ర జిల్లా షాహబాద్‌ మండలం హల్ధేరీ గ్రామం. తన స్నేహితుడు అంగ్రెజ్‌తో కలిసి పంట పొల్లాల్లో ఆడుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నోడు ప్రిన్స్‌. ఇంతలో ఓ ఎలుక వాళ్ల కంట పడింది. దాని వెంట పడుతూ పరుగులు తీశారు ఆ ఇద్దరు. ఇంతలో అది ఓ సంచిని దాటుకుని కలుగులోకి దూరింది. ఆ పాలిథీన్‌ సంచిపై ఒక్క దూటున దూకారా పిల్లలు. అంగ్రెజ్‌ పక్కకు పడిపోగా.. ప్రిన్స్‌ మాత్రం క్షణాల్లో 60 అడుగుల బోరుబావిలోకి జారిపోయాడు. అయితే..

అంగ్రెజ్‌ ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్లి అందరినీ తీసుకొచ్చాడు. జనం, పోలీసులు, అధికారులు, బుల్డోజర్లు.. కాసేపటికే రెస్క్యూ వాతావరణంతో అక్కడి వాతావరణం మారిపోయింది. హర్యానా కావడంతో ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే నేల స్వభావం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌ నెమ్మదిగా సాగింది. ఈలోపు దేశం మొత్తం ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేసింది. ఈ మధ్యలో..

చిన్నా.. భయపడకు. ఎలాగైనా నిన్ను బయటకు తీస్తాం అంటూ తల్లిదండ్రుల మాటలు, అధికారుల పిచ్చాపాటి సంభాషణలతో ప్రిన్స్‌ ఏడవకుండా ధైర్యంగా ఉండిపోయాడు. సుమారు 50 గంటల తర్వాత పిల్లాడిని సజీవంగా బయటకు తీయగలిగింది సైన్యం. అంతే దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది.

అలా బోర్‌వెల్‌ బాయ్‌గా స్థిరపడిన ఆ చిన్నారి ప్రిన్సే.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా నవీన్‌ జిందాల్‌తో లైవ్‌లో కనిపించాడు. ఆనాడు బోరుబావిలో పడ్డాక ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్న జిందాల్‌ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ టైంలో ప్రిన్స్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. సరైన తిండి లేక ప్రిన్స్‌ నీరసంగా కనిపించాడు. బోరుబావిలో పడిన సమయంలో.. దేశం నలుమూలల నుంచి ఆ కుర్రాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతర తినుబండారాలు వచ్చాయి. అదలా కొన్నాళ్లపాటు కొనసాగింది అని గుర్తు చేశారాయన. తాను ఎవరి నుంచి ఎలాంటి సాయం ఆశించడం లేదని.. దేవుడిచ్చిన జీవితం.. సైన్యం ప్రసాదించిన పునర్జన్మతో తన కాళ్ల మీద తాను నిలబడతానని చెబుతున్నాడా మృత్యుంజయుడు.

Advertisement
 
Advertisement
Advertisement