KGF: బంగారు గనుల్లో అణు వ్యర్థాల డంపింగ్‌?

KGF: Dumping Of Nuclear Waste In Gold Mine At KGF - Sakshi

యురేనియం వ్యర్థాలను  గనుల్లో డంప్‌ చేస్తారా ?

స్థానికుల్లో కలవరం

కేజీఎఫ్‌: కేజీఎఫ్‌ తెరపైన, తెర వెనుక వార్తల్లో నిలుస్తోంది. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్కేంద్రంలో వెలువడే అణు వ్యర్థాలను కేజీఎఫ్‌లోని బంగారు గనుల్లో డంప్‌ చేస్తారనే వార్తలు మరోసారి కలకలం రేపాయి. తమిళనాడులో కొందరు ప్రముఖులు తా­జాగా దీనిపై ప్రకటనలు చేసినట్లు వార్తలు రాగా, కేజీఎఫ్‌ ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

కేజీఎఫ్‌లో బంగారు గనులు మూతబడి దాదాపు 14 ఏళ్లు పైబడింది. వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. బంగారు గనులను పునః ప్రారంభం చేయాలని స్థాని­కు­లు, నాయకులు ప్రభుత్వాలపై ఒత్తిడిలు చేస్తు­న్న సమయంలో యురేనియం వ్యర్థాలను ఈ గనుల సొరంగాల్లో పడేస్తారన్న వార్తలు చర్చనీయాంశమయ్యా­యి.  

సైనైడ్‌ దిబ్బలతో సమస్య  
బీజీఎంఎల్‌ గోల్డ్‌ మైన్స్‌ నడుస్తున్న సమయంలో గనుల నుంచి తవ్వితీసిన లక్షల టన్నుల మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. సైనైడ్‌ దిబ్బలుగా పేరుపొందిన వీటి నుంచి గాలి దుమారం రేగినప్పుడల్లా దుమ్ముధూళి వ్యాపించి స్థానికులు శ్వాసకోశ సమస్యలు, అలర్జీల బారిన పడ్డారు. 
దీంతో జిల్లా యంత్రాంగం మేల్కొని సైనైడ్‌ దిబ్బలపై మొక్కలు పెంచడంతో దుమ్ము కొంచెం తగ్గింది. ఇంతలోనే ప్రాణాంతక అణు వ్యర్థాలను ఇక్కడ నిల్వ చేస్తారనే వార్తలు పిడుగుపాటుగా పరిణమించాయి.  

పోరాటాలు చేస్తాం: ఎమ్మెల్యే  
అణు వ్యర్థాలను కేజీఎఫ్‌లో వేయడానికి ఎట్టి పరిస్థితిలోను అనుమతించేది లేదని, ఇందుకోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధమని స్థానిక ఎమ్మెల్యే రూపా శశిధర్‌ తెలిపారు. నగర ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. వ్యర్థాలను అక్కడే వేసుకోండి అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top