దేశంలోనే తొలిసారి.. కేరళ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం | Kerala Moves to Become First State to Grant Industry Status to Cinema | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలిసారి.. కేరళ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం

Oct 8 2026 1:55 PM | Updated on Oct 8 2026 2:14 PM

Kerala Moves to Become First State to Grant Industry Status to Cinema

వీడీ సతీశన్‌తో మోహన్‌ లాల్‌ (ఫైల్‌ ఫొటో)

వీడీ సతీశన్‌ నేతృత్వంలోని కేరళ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. దేశంలోనే తొలిసారిగా సినిమా రంగానికి  కొత్త గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు కళా, సాంస్కృతిక రంగంగా ఉన్న మలయాళ సినిమా.. ‘ఇండస్ట్రీ’ గుర్తింపు దక్కించుకోనుంది. ఇందుకు సంబంధించిన విధాన ముసాయిదా సిద్ధం కాగా శాఖల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ నెలలోనే ప్రతిపాదనను కేబినెట్‌ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

మలయాళ సినిమాకు ఇండస్ట్రీ హోదా ఇవ్వాలన్న ఆలోచన ఇప్పుడే పుట్టింది కాదు. గత పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం హయాంలోనే దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది. 2024లో సమగ్ర ఫిల్మ్‌ పాలసీ రూపొందించేందుకు కేరళ ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. సినిమా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాల్లోని సమస్యలను అధ్యయనం చేసి విధానాన్ని రూపొందించేందుకు కన్సల్టెన్సీని కూడా నియమించింది.

ఆ తర్వాత 2025 ఆగస్టులో కేరళ ఫిల్మ్‌ పాలసీ కాన్‌క్లేవ్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించిన ఈ రెండు రోజుల సదస్సుకు సినీ రంగానికి చెందిన 500 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. పరిశ్రమ భవిష్యత్తు, కార్మికుల హక్కులు, మహిళల భద్రత, సినిమా రంగానికి అవసరమైన విధానపరమైన మార్పులపై విస్తృతంగా చర్చించారు.

92 సిఫారసులతో ఫిల్మ్‌ పాలసీ
ఈ కసరత్తు కొనసాగి.. 2026 మార్చిలో కేరళ కేబినెట్‌ సమగ్ర స్టేట్‌ ఫిల్మ్‌ పాలసీకి ఆమోదం తెలిపింది. మొత్తం 92 సిఫారసులు, ప్రతిపాదనలతో ఈ పాలసీని రూపొందించారు. సినిమా రంగాన్ని మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దడం, నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికుల హక్కులకు రక్షణ కల్పించడం, మహిళలకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు.

అంతేకాదు.. సినిమాను ఒక పరిశ్రమగా గుర్తించాలన్న ప్రతిపాదన కూడా ఈ ఫిల్మ్‌ పాలసీలోనే ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యకు ఇప్పటికే రూపొందిన విధానపరమైన పునాది ఉంది.

బడ్జెట్‌లోనే కీలక ప్రకటన
ప్రస్తుత వీడీ సతీశన్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో సినిమా రంగానికి ఇండస్ట్రీ స్టేటస్‌ కల్పించే ప్రతిపాదనను ప్రకటించింది. కొచ్చిలో జేసీ డేనియల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ సిటీ ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించింది. అంతర్జాతీయ స్థాయి సినిమా నిర్మాణాలను కేరళకు ఆకర్షించడం, ఫిల్మ్‌ సెక్టార్‌కు మౌలిక వసతులు కల్పించడం, యాంటీ పైరసీ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి ప్రతిపాదనలతో ఈ ప్రాజెక్టును అనుసంధానించింది.

ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీ స్టేటస్‌కు సంబంధించిన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధం కావడంతో ఈ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. వివిధ శాఖల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ నెలలోనే ప్రతిపాదనను కేబినెట్‌ ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

హోదా వస్తే ఏం మారుతుంది?
ఇండస్ట్రీ స్టేటస్‌ వల్ల కేవలం పేరుకు గుర్తింపు రావడం కాకుండా.. సినిమా రంగానికి ఆర్థిక, పరిపాలనా వెసులుబాట్లు కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల్లో నిధుల సమీకరణ ఒకటి. ఇండస్ట్రీ హోదా వస్తే వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి సినిమా నిర్మాణానికి రుణాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయని నిర్మాత జి. సురేశ్‌ కుమార్‌ చెబుతున్నారు.

అదే సమయంలో షూటింగ్‌లకు అనుమతులు, స్థానిక సంస్థల నిబంధనలు, విద్యుత్‌ చార్జీలు, పన్నులు వంటి అంశాలపైనా ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. వివిధ శాఖలు, స్థానిక సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గించేలా సింగిల్‌ విండో విధానం తీసుకురావాలన్న డిమాండ్‌ కూడా ఉంది.

కార్మికులకూ రక్షణ
ఇండస్ట్రీ స్టేటస్‌ చర్చ కేవలం నిర్మాతలు, పెద్ద నిర్మాణ సంస్థలకు పరిమితం కాకుండా.. సినిమా రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశాలనూ కలిగి ఉంది. 2026లో ఆమోదించిన ఫిల్మ్‌ పాలసీలో కార్మిక హక్కులు, లింగ సమానత్వం, సురక్షితమైన పని వాతావరణం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సినిమా నిర్మాణ సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం, మహిళలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించడం వంటి సిఫారసులు కూడా ఉన్నాయి.

ఆర్థిక ఇబ్బందుల వేళ..
మరోవైపు మలయాళ సినిమా పరిశ్రమ ప్రస్తుతం పలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. నిర్మాణ వ్యయాలు పెరగడం, ఓటీటీ కొనుగోళ్లలో మందగమనం వంటి అంశాలు నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు అధికారిక గుర్తింపు, సంస్థాగత రుణాలు, అనుమతుల ప్రక్రియలో సరళీకరణ వంటి చర్యలు కీలకంగా మారుతున్నాయి. అందుకే ఇండస్ట్రీ స్టేటస్‌ కేవలం హోదా కాదు.. సినిమా రంగానికి ఆర్థికంగా, పరిపాలనాపరంగా కొత్త అవకాశాలు తెరుస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కేబినెట్‌ నిర్ణయంపైనే ఉత్కంఠ
ప్రస్తుతం పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధమైనా.. మలయాళ సినిమా అధికారికంగా ఇండస్ట్రీ హోదా పొందినట్లు కాదు. వివిధ శాఖల సంప్రదింపులు పూర్తయిన తర్వాత ప్రతిపాదన కేబినెట్‌ ముందుకు వెళ్లాలి. ఆమోదం లభించిన తర్వాతే తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే.. ఏళ్లుగా సాగుతున్న కసరత్తు ఇప్పుడు తుది మలుపులోకి వచ్చింది.కేబినెట్‌ ఆమోదం లభిస్తే.. మలయాళ సినిమా ఇక కేవలం కళా, సాంస్కృతిక రంగంగా కాకుండా అధికారికంగా ‘ఇండస్ట్రీ’గా కొత్త గుర్తింపు పొందే దిశగా కేరళ మరో అడుగు ముందుకేసినట్టే.

ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కోసం కట్టుదిట్టమైన భద్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement