కశ్మీర్లో జీ–20 సన్నాహకం షురూ

Kashmir gears up for G20 summit with heightened security - Sakshi

త్వరలో నూతన పర్యాటక విధానం: కిషన్‌రెడ్డి

శ్రీనగర్‌: పాకిస్తాన్‌ పెడబొబ్బలను, చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జమ్మూ కశ్మీర్‌లో జీ–20 సన్నాహక సదస్సు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం మొదలైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చైనా మినహా అన్ని సభ్య దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. పర్యాటక రంగం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. వారికి సంప్రదాయ రీతిలో ఘనస్వాగతం లభించింది.

తొలి రోజు ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు సినీ టూరిజం’ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ప్రతినిధులంతా చారిత్రక దాల్‌ సరస్సులో బోట్‌ షికారు చేస్తూ కశ్మీర్‌ అందాలను ఆస్వాదించారు.  కేంద్రం త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర సాంస్కృతి పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

గ్లోబల్‌ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి కశ్మీర్‌లో అద్భుతమైన అవకాశాలున్నాయని మీడియా తో చెప్పారు. పర్యాటకాభివృద్ధికి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్‌ భాగస్వామ్యం లేకుండా ప్రపంచ స్థాయికి చేరుకోలేమన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

హర్తాళ్‌ పిలుపులు గత చరిత్ర
కశ్మీర్‌ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, మునుపటి లాగా బంద్‌ పిలుపులకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. ‘‘గతంలో కశ్మీర్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాక్‌ నుంచి వచ్చిన పిలుపుతో దుకాణాలు మూతబడేవి. ఇప్పుడు మాత్రం హర్తాళ్‌ చేపట్టాలంటూ ఎవరు పిలిపిచ్చినా పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే రెండు తరాలు నష్టపోయిన విషయం ప్రజలు తెలుసుకున్నారు. అభివృద్ధి బాటన ముందుకు సాగాలనుకుంటున్నారు’’ అని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధికి కశ్మీర్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top