తొలి రోజే రచ్చ..

Karnataka Budget Assembly sessions - Sakshi

ఒక దేశం– ఒక ఎన్నికపై చర్చ

అడ్డుకున్న కాంగ్రెస్

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు షురూ  

సాక్షి, బెంగళూరు: బడ్జెట్‌ సమావేశాలు రచ్చతోనే ప్రారంభమయ్యాయి. అధికార– ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. గురువారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విధానసభలో ఒక దేశం– ఒక ఎన్నికపై చర్చించాలని సభాపతి విశ్వేశ్వరహెగడే కాగేరి సూచించారు దీనిపై కాంగ్రెస్‌ పక్ష నేత సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరికీ చెప్పకుండా చర్చకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 363 ప్రకారం ఉన్న విశేషాధికారాలతో చర్చకు ఆహ్వానించినట్లు సభాపతి తెలిపారు. విపక్ష సభ్యులు సభాపతి పోడియం చుట్టుముట్టారు. చర్చిస్తే తప్పేముందని బీజేపీ సభ్యులు వాదించారు. ఇరువర్గాల అరుపులతో గందరగోళం నెలకొంది.  

గందరగోళం తగదు: సీఎం..  
సీఎం యడియూరప్ప మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు క్షమించబోరన్నారు. మొదటిరోజే గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి విశ్వసనీయత లేదు, సభలో ఆందోళన చేయడం సరికాదని సూచించారు.  

షర్టు విప్పేసిన ఎమ్మెల్యే.. 
భద్రావతి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంగమేశ్‌ సభాపతి పోడియం ముందుకు వచ్చి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసభ్యంగా ప్రవర్తించారని ఆయనను సభాపతి సస్పెండ్‌ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సంగమేశ్‌కు షర్టు వేశారు. ఈ ఘటనతో 10 నిమిషాల పాటు స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మళ్లీ సభ మొదలుకాగా మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ –స్పీకర్‌ కాగేరి మధ్య సభాపతి ప్రత్యేక అధికారాలపై తీవ్ర చర్చ సాగింది. ఇక సెక్స్‌స్కాండల్‌లో ఇరుక్కుని మంత్రి పదవిని కోల్పోయిన రమేశ్‌ జార్కిహొళి సభకు గైర్హాజరయ్యారు. ఆయన సోదర ఎమ్మెల్యేలూ ముఖం చాటేశారు.

ఒక ఎన్నికతో మేలు: స్పీకర్‌  
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని సభాపతి పేర్కొన్నారు. వేర్వేరుగా ఎన్నికల వల్ల సిబ్బందిపై ఎంతో భారం పడుతుంది, రాష్ట్రంలో పాలన కూడా కుంటుపడుతుందన్నారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా, మాకు వద్దని కాంగ్రెస్‌ సభ్యులు నిరసన తెలిపారు.
చదవండి:
రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?  
శశికళ నిష్క్రమణ వెనుక..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top