‘జోడో యాత్రలో పాల్గొంటే పొలిటికల్‌ కెరీర్‌ నాశనం అవుతుందన్నారు’

Kamal Hassan Interesting Comments On Bharat Jodo Yatra - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో రాహుల్‌ గాంధీకి భారీ మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా రాహుల్‌కు మద్దుతు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, అనూహ్యంగా రాహుల్‌ యాత్రలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, నటుడు కమల్‌ హాసన్‌ పాల్గొని తన మద్దతు ప్రకటించారు. 

భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా కమల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. దేశం కోసం చేతులు కలపాల్సిన సమయం వచ్చింది. రాహుల్‌ జోడో యాత్రలో పాల్గొనవద్దని చాలా మంది చెప్పారు. రాహుల్‌ యాత్రలో పాల్గొంటే పొలిటికల్‌ కెరీర్‌ దెబ్బతింటుందని చెప్పారు. నేను భారతీయుడిగా ఇక్కడ ఉన్నాను. మా నాన్న కాంగ్రెస్‌ వాది. నేను వివిధ సిద్ధాంతాలను కలిగి ఉండి, నా సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాను. కానీ దేశం విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి. నేను అద్దం ముందు నిలబడి నాకు నేను చెప్పుకున్నాను. ఇది.. దేశానికి, నాకు అత్యంత అవసరమైన సమయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇక రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర.. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోకి చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్‌కు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా, పాదయాత్రలో భాగంగా రాహుల్‌ ఇప్పటికే 3వేల కిలోమీటర్లు పూర్తి చేశారు. భారత్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి జమ్మూకాశ్మీర్‌లో ముగిసేలోపు రాహుల్‌ 3,570 కిమీలు ప్రయాణించనున్నారు. ఇందులో భాగంగానే 12 రాష్ట్రాలను రాహుల్‌ కవర్‌ చేయనున్నారు. 

భారత్ జోడో యాత్ర శనివారం న్యూఢిల్లీలోని ఎర్రకోటకు చేరుకున్న సందర్బంగా రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా రాహుల్‌ మాట్లాడుతూ.. దేశాన్ని వాస్తవ సమస్యల నుండి మళ్లించడానికి బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను వ్యాప్తి చేస్తోందని అన్నారు. ఇది ప్రధాని మోదీ ప్రభుత్వం కాదు.. అంబానీ, అదానీల ప్రభుత్వం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top