ఇన్‌స్టంట్‌ ఫేమ్‌ గాల్లో దీపం అంతే! | Kacha Badam Singer Bhuban Fame To Down Fall | Sakshi
Sakshi News home page

చదువు, లోక జ్ఞానం లేకుంటే అంతే!.. అయినవాళ్ల మోసంతో అద్దెంటికి చేరిన కచ్చా బాదం సింగర్‌

Mar 6 2023 10:07 AM | Updated on Mar 6 2023 10:21 AM

Kacha Badam Singer Bhuban Fame To Down Fall - Sakshi

లోక జ్ఞానం, అంతకు మించి చదువులేకపోవడంతో గుడ్డిగా నమ్మేసి.. 

సోషల్‌ మీడియా జమానాలో.. ఫేమస్‌ ఎవ్వడం ఎంత తేలికనో, పతనం అవ్వడం కూడా అంతే తేలికగా జరిగిపోతోంది. రాత్రికి రాత్రే దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకోవడమే కాదు, ఆ క్రేజ్‌ ద్వారా అల్లుకున్న పరిస్థితులను(సానుకూల, ప్రతికూల పరిస్థితులను) తట్టుకుని నిలబడగలగడమూ గొప్పే.  లోక జ్ఞానం, అంతకు మించి చదువులేని  కచ్చా  బాదాం ఫేమ్‌ భూబన్‌ బద్యాకర్‌.. ఆ పేరును, ఫేమ్‌ను నిలబెట్టుకోవడం ఘోరంగా తడబడ్డాడు. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పచ్చి శనగల వ్యాపారి ‘కచ్చా బాదమ్‌’ సాంగ్‌తో బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ దక్కిన ఫేమ్‌తో పాటలు, ప్రదర్శనలతో తెగ బిజీ అయ్యాడు. వచ్చిన డబ్బును వచ్చినట్లే ఖర్చు పెట్టాడు. కారు కొని యాక్సిడెంట్‌తో ఆస్పత్రి పాలయ్యాడు. ఊరి జనాలే కదా అనుకుని అడిగిన వాళ్లకల్లా అప్పులు ఇచ్చుకుంటూ పోయాడు. మరోవైపు డబ్బు తరిగిపోతుండడంతో బంధువులూ దూరం అయ్యారు. ఆఖరికి.. జనాలు వేధింపులకు దిగడంతో భరించలేక సొంత ఊరిని, ఇంటిని విడిచిపెట్టి దూరంగా అద్దె ఇంటికి చేరి మళ్లీ వేరుశనగ వ్యాపారంలోకే దిగాడు. 

భూబన్‌ తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చదువు, లోక జ్ఞానం లేకపోవడంతో తాను ఎంతగా మోసపోయింది, మళ్లీ వీధికెక్కింది వివరించాడతను.  ఒప్పందం పేరిట ఓ కంపెనీ తనను ఎలా మోసం చేసిందో చెప్తూ వాపోయాడను. తాజాగా యూట్యూబ్‌లో ఈ కంట్రీ ఫేమస్‌ లోకల్‌ సింగర్‌ ఏ పాట అప్‌లోడ్‌ చేసినా.. కాపీ రైట్‌ ఇష్యూ వస్తోందట. బాదామ్‌ అనే పదం ఉంటే చాలూ.. తొలగించాల్సిందేనంటూ యూట్యూబ్‌ నోటీస్‌ పంపుతోందట. ఇందుకు కారణం.. గుడ్డిగా ఓ ఒప్పందం మీద అతను సంతకం చేయడమే!. 

బీర్‌భూమ్‌కు చెందిన ఓ కంపెనీ.. ఇండియన్‌ ఫర్‌ఫార్మింగ్‌ రైట్‌ సొసైటీ లిమిటెడ్‌(IPRS)పేరుతో భూబన్‌ను సంప్రదించింది. తమతో ఒప్పందం చేసుకోవాలని రూ. 3లక్షలను ఆఫర్‌ చేసింది. డబ్బు కోసం వాళ్లు చూపించిన పత్రాల మీద సంతకం చేశాడాయన. చదువు లేకపోవడంతో అందులో వాళ్లు ఏం రాశారో కూడా తెలియకుండా పోయింది. అయితే వాళ్లు ఆయన్ని మోసం చేశారు. కాపీరైట్స్‌ను వాళ్ల పేరు మీద రాయించేసుకున్నారు.  ఆ తర్వాత యూట్యూబ్‌ స్ట్రైక్‌ వస్తుండడంతో..  ఈ విషయమై ఆయన కొందరు యూట్యూబర్ల ద్వారా ఐపీఆర్‌ఎస్ ప్రతినిధులను సంప్రదించాడు. కానీ, అందులో తమ ప్రమేయం లేదని ఐపీఆర్‌ఎస్‌ వాళ్లు తేల్చడం, యూట్యూబ్‌ నుంచి కాపీరైట్స్‌ ఓనర్‌షిప్‌ సదరు కంపెనీ పేరిట ఉందని తేలడంతో భూబన్‌ తాను ఎంతగా మోసపోయిందనేది తెలుసుకున్నాడు. అదే సమయంలో.. 

స్వగ్రామం కురల్‌జూరి ప్రజలు ఏడాది కాలంగా అప్పుల పేరుతో అతని నుంచి డబ్బు కాజేశారు. వాళ్ల నుంచి వసూలు చేసే యత్నంలో.. స్థానిక యువకుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నాడు భూబన్‌. మరోవైపు జేబు గుళ్లా కావడంతో బంధువులు సైతం అతనికి దూరం అయ్యారు. చేసేది లేక.. ఇంటికి తాళం వేసి అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్తలాకు చేరుకుని అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. ఏనాటికైనా మళ్లీ తన పాటను మళ్లీ వినిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తూనే.. మళ్లీ వీధికెక్కి పల్లీలు అమ్ముకుంటున్నాడాయన.

ఇంటర్నెట్‌ ద్వారా దక్కే ఇన్‌స్టంట్‌ ఫేమ్‌ అనేది మూన్నాళ్ల ముచ్చటే అనే విషయం ఈ కచ్చా బాదం సింగర్‌ ద్వారా మరోసారి రుజువైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement