
దేశంలో ఏ మూల చూసినా రోడ్ల గోసే ... నెల క్రితం వేసిన జాతీయ రహదారులు సైతం గుంతలు పడుతున్నతీరు.. ఇక గ్రామాలు.. జిల్లా రోడ్లు అయితే మరీను... ఎక్కడ అడుగుపెడితే అక్కడ మోకాలి లోతు గొయ్యి.. బండి నడపడం అంటే సర్కస్ తో సమానం. సైకిళ్ళు అయితే వెంటనే ఫోర్క్ విరిగిపోవాల్సిందే.. కార్లు అయితే గుంతల్లో పడి మరిక ముందుకు కదల్లేని పరిస్థితి.. ఇక్కడ కాంట్రాక్టర్ తో బాటు ప్రభుత్వాలు కూడా ఈ దుస్థితికి కారణమే అని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్లలో చేపలు పడుతూ.. వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత ఆధునికత సంతరించుకున్న ఈరోజుల్లేనే ఇలా ఉంటె ఆరోజుల్లో రోడ్లు ఇంకెలా ఉండేవో అనే సందేహం మనకు తప్పక వస్తుంది. కానీ ఆరోజులే అద్భుతం.. అప్పట్లో పుణేలో వేసిన రోడ్డు ఇంకా నునుపుగా .. కనీసం పింపుల్ కూడా లేని డ్రీమ్ గర్ల్ బుగ్గల్లా ఉన్నాయ్. దీనికి అప్పటి కాంట్రాక్టర్ తో బాటు ప్రభుత్వనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. సరిగ్గా యాభయ్యేళ్ళ క్రితం పుణేలో రెండున్నర కిలోమీటర్ల పొడవునా జంగ్లీ మహారాజ్ రోడ్డును నిర్మించారు. ఎనిమిదో శతాబ్దంలో రాష్ట్రకూట మహారాజులు శివును పేరిట నిర్మించిన జంగ్లీ మహారాజ్ ఆలయం ఈ రోడ్డుసమీపానే ఉంది.
అందుకే ఈ రోడ్డుకు జంగ్లీ మహారాజ్ రోడ్డు అని పేరుపెట్టి అప్పట్లో రూ. 15 లక్షలతో నిర్మాణం చేపట్టారు. దాదాపు ఏడాదిన్నరలో రెకాండో (Recondo) అనే ముంబై కి చెందిన నిర్మాణ సంస్థ 1976లో ఈ రోడ్డును నిర్మించింది. అప్పట్లో ఆ రోడ్డుకు ఆ నిధులు ఎక్కువే కానీ సదరు సంస్థ నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదు. అంతేకాకుండా వచ్చే పదేళ్లలో రోడ్డుకు ఎక్కడైనా చిన్న గుంత పడినా.. ఇంకేదైనా మరమ్మతు వచ్చినా రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా తాను మళ్ళీ రోడ్డును పునర్నిర్మిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. కానీ ఆశ్చర్యంగా ఇరవై.. ముప్పై ఏళ్లయినా ఆ రోడ్డు అప్పడు నిర్మించినట్లే కొత్తగా తళతళ మెరుస్తూ ఉంది. ఇప్పటి కాంట్రాక్టర్లను.. వారిని పర్యవేక్షించే అధికారుల అవినీతిని వెక్కిరిస్తూనే ఉంది.
అప్పటి పూణే మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీకాంత్ షిరోలే ఈ రోడ్డుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటి రోజులే వేరు.. కాంట్రాక్టర్ గొప్ప చిత్తశుద్ధితో ఎక్కడా రాజీపడకుండా రోడ్డును నిర్మించారు. అందుకే ఇన్నేళ్లయినా చెక్కుచెదరకుండా ఉంది అన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ గా శ్రీకాంత్ శిరోలే ఈ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పని గొప్పగా పూర్తయ్యేలా అకుంఠిత దీక్షతో దాన్ని చేపట్టారు. సదరు నిర్మాణ సంస్థ కూడా అంతే శ్రద్ధతో దాన్ని పూర్తి చేసింది. ఆ తరువాత పుణె నగరం జనసమ్మర్థంగా మారడం, ట్రాఫిక్ పెరగడంతో ప్రభుత్వం ఆ రోడ్డును మరింత విస్తరించింది. కానీ అప్పటి నాణ్యతను మాత్రం ప్రజలన స్మృతిపథం నుంచి చెరపలేకపోయింది. ఇప్పటికీ ఆ రోడ్డు కు ఇరువైపులా మిరుమిట్లు గొలిపే దుకాణాలతో షాపింగ్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
ఆశ్చర్యం ఏమంటే ఆ తరువాత సదరు రెకాండో (Recondo) అనే నిర్మాణ సంస్థకు మరెక్కడా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు దక్కలేదు. అదేంటో దేశంలో పని బాగా చేసేవాళ్లకు ఉద్యోగాలు దొరకవు.. నిజాయితీగా ఉండే నేతలకు అసెంబ్లీ టికెట్లు దొరకవు.. నిజాయితీగా నాణ్యతతో పని చేసే కాంట్రాక్టు సంస్థలకు కొత్త కాంట్రాక్టులు దక్కవు.
:::సిమ్మాదిరప్పన్న
Junglee Maharaj Road, Pune: This road is legendary for being pothole free.
Built by a contractor Recondo run by 2 Parsi brothers in the 1970’s.
It employed the best technique & materials
And gave a guarantee to repair it for free for 10 years.
They never got a road contract again pic.twitter.com/qrZHpYS4hD— Vishal Bhargava (@VishalBhargava5) August 5, 2025