జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఇళ్లలో... ఐటీ శాఖ సోదాలు

IT searches on Jharkhand Congress MLAs over tax evasion charges - Sakshi

రాంచీ/న్యూఢిల్లీ:  జార్ఖండ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కుమార్‌ జైమంగళ్, ప్రదీప్‌ యాదవ్‌ల నివాసాలు, కార్యాలయాల్లో అదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేసినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో భాగంగానే రాంచీ, బెర్మో, పట్నాలో ఈ సోదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. చైబాసాలో ముడి ఇనుప ఖనిజ వ్యాపారితోపాటు మరికొందరి ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఐటీ సోదాలపై ఎమ్మెల్యే జైమంగళ్‌ అలియాస్‌ అనూప్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిళ్లతోనే ఈ సోదాలు నిర్వహించారని ఆరోపించారు.

బీజేపీని వ్యతిరేకిస్తే వేధిస్తారా? అని ప్రశ్నించారు. తనను ఎవరూ భయపెట్టలేరని అన్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే కుట్రల్లో భాగంగానే తమ ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయని జార్ఖండ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజీవ్‌ రంజన్‌ విమర్శించారు. అయితే, ఐటీ శాఖ ఆపరేషన్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత బాబూలాల్‌ మరాండీ తేల్చిచెప్పారు. పన్నుల ఎగవేత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఐటీ శాఖపై బురద చల్లుతున్నారని జార్ఖండ్‌ బీజేపీ నేత ప్రతుల్‌ షాదియో దుయ్యబట్టారు. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్‌ సైతం భాగస్వామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top