
రేపు సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–16 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్టేషన్ (నాసా) తొలిసారి సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువైన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.
ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం రాత్రి మిషన్ రెడీ రివ్యూ (ఎంఆర్‌ఆర్) నిర్వహించారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థలకు తుది తనిఖీలు నిర్వహించి రాకెట్ సంసిద్ధం చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ ఆధ్వర్యంలో రాకెట్‌కు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. 27.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధం చేశారు.