న్యూఢిల్లీ: సౌదీ అరేబియాపై ఇరాన్ జరిపిన దాడుల్లో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారని విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో, పశి్చమాసియా సంక్షోభం కారణంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకోగా మరొకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ అధికారి అసీమ్ మహాజన్ శుక్రవారం చెప్పారు. తాజా మరణానికి దారి తీసిన కారణాలను మాత్రం ఆయన వివరించలేదు.
భారత్‌లోని మృతుడి కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వివరించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి రియాద్‌లోని లక్ష్యాలపై ఇరాన్ నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు కూలి్చవేశాయి. రియాద్‌లోని ఓ రిఫైనరీ సమీపంలో ఈ క్షిపణుల శకలాలు పడ్డాయి. శకలాలు తగలడంతోనే భారతీయుడు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
కాగా మృతిచెందిన వ్యక్తి తెలంగాణకు మహాబూబాబాద్‌కు చెందిన రవిగోపాల్‌గా సమాచారం. దీనిపై వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ " 18 వతారీఖు రాత్రి. 9.30 గంటలకు చివరి సారిగా రవితో మాట్లాడాము 20 నిమిషాలు మాట్లాడిన అనంతరం కాల్ కట్ అయ్యింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడే ఉన్న వేరేవారితోనూ మాట్లాడానికి ప్రయత్నించాము వారు సైతం కాల్‌లోకి రాలేదు" అని వారి కుటుంబసభ్యులు తెలిపారు.
అయితే సౌదీపై జరిగిన దాడుల్లో రవి మరణించినట్లు మరుసటి రోజు రామ్ నివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కాగా కుటుంబంలో రవి ఒక్కరే ఉద్యోగం చేస్తారని అతని కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి నాలుగేళ్ల కుమారుడని పేర్కొన్నారు. దయచేసి అతని మృతదేహాన్ని తమకు అప్పగించాలని తమకు పరిహారం ఇప్పించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


