
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అయితే ఈ పరిణామంతో కంగుతిన్న పాక్ తిరిగి సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు వేడుకుంటోంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా మరోమారు ఈ విషయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారు.
ఇస్లామాబాద్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటికీ పునరుద్ధరించబోదని, పాకిస్తాన్‌కు ప్రవహించే సింధు నీటిని భారత అంతర్గత వినియోగం కోసం మళ్లించనున్నామని హోంమంత్రి అమిత్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన అనంతరం సింధు నదీ వ్యవస్థ వినియోగాన్ని నియంత్రించే 1960 ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం కింద భారతదేశంలోని మూడు నదుల నీటిని పాకిస్తాన్‌లోని 80శాతం పొలాలకు అందించేందలా నాడు ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం రద్దుపై తాజాగా స్పందించిన అమిత్ షా.. ఒక కాలువ నిర్మించడం ద్వారా పాకిస్తాన్‌కు ప్రవహిస్తున్న నీటిని రాజస్థాన్‌కు మళ్లిస్తామని, అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఈ ఒప్పందంపై చర్చల కోసం తపిస్తున్న ఇస్లామాబాద్ ఆశలను నీరుగార్చాయి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయాలని ఇస్లామాబాద్ యోచిస్తున్నదని సమాచారం.
ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?