ఏ సవాలునైనా ఎదుర్కోగలం | India showed ability to meet all challenges Says PM Narendra modi | Sakshi
Sakshi News home page

ఏ సవాలునైనా ఎదుర్కోగలం

Jan 29 2021 4:30 AM | Updated on Jan 29 2021 5:20 AM

India showed ability to meet all challenges Says PM Narendra modi - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ అయినా, సరిహద్దు వివాదం అయినా.. ఎలాంటి సవాలునైనా భారత్‌ ఎదుర్కోగలదని గత సంవత్సరం నిరూపితమైందని ప్రధాని మోదీ అన్నారు. కరోనా మహమ్మారి వల్ల మన ఆర్థిక వ్యవస్థపై పడిన దుష్ప్రభావాలను కూడా అదే విధంగా, అదే దృఢ నిశ్చయంతో పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ) ర్యాలీనుద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితి గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో స్వావలంబన సాధించిన విధంగానే, సాయుధ దళాలను ఆధునీకరించే విషయంలోనూ ముందుకు వెళ్తామన్నారు. అన్ని సాయుధ దళాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు తాజాగా వచ్చిన మూడు రఫేల్‌ యుద్ధ విమానాలకు యూఏఈ, సౌదీ అరేబియాల్లో ఆకాశంలోనే ఇంధనం నింపారని, ఈ విషయంలో ఆ రెండు దేశాలతో పాటు గ్రీస్‌ కూడా సాయం చేసిందని ప్రధాని తెలిపారు. భారత్‌తో గల్ఫ్‌ దేశాలకు ఉన్న సత్సంబంధాలను ఇది రుజువు చేస్తుందని వ్యాఖ్యానించారు. రక్షణ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారుగా భారత్‌ మారనుందన్నారు.

ప్రపంచానికి భారత్‌ టీకా సాయం
కోవిడ్‌పై పోరులో ప్రపంచదేశాలకు భారత్‌ సహకారం అందిస్తుందని మోదీ అన్నారు. వరల్డ్‌ఎకనమిక్‌ఫోరం దావోస్‌ అజెండా సమిట్‌పై మాట్లాడారు. ‘చాలా దేశాలకు కోవిడ్‌ టీకాలు పంపించాం. 150పైగా దేశాలకు మందులు అందజేశాం. దేశంలో తయారైన రెండు టీకాలను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నాం. మరికొన్ని టీకాలను కూడా అందజేయనున్నాం’ అని ప్రధాని అన్నారు.
ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి
గౌరవవందనం స్వీకరిస్తున్న మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement