
స్పష్టం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, అణుయుద్ధ ప్రమాదాన్ని అమెరికాయే నివారించిందని.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఖండించారు. ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య నేరుగా కాల్పుల విరమణ చర్చలు జరిగాయని, మరే ఇతర దేశం పాత్ర లేదని జైశంకర్ నొక్కి చెప్పారు.
ఉద్రిక్తతలను తగ్గించాలంటూ పాక్ చేసిన ప్రతిపాదనకు భారత్ స్పందించిందని, కాల్పుల విరమణకు అంగీకరించిందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్‌ను సందర్శించాల్సి ఉండగా, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో జైశంకర్ ఆయన స్థానంలో వెళ్లారు. గురువారం డచ్ దినపత్రిక డి వోక్స్‌క్రాంట్‌కు ఇచి్చన విస్తృత ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్ని దేశాల్లాగే అమెరికా మాట్లాడింది
భారత్–పాక్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. అనేక దేశాలు భారత్‌ను సంప్రదించాయని, పాకిస్తాన్‌తో కూడా మాట్లాడాయని, అమెరికా సైతం అలాగే మాట్లాడిందని తెలిపారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు సహా అగ్రశ్రేణి అధికారులు తమను సంప్రదించారని, కానీ వారు తమ ఆందోళనలను మాత్రమే తెలియజేశారని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరుకుంటే నేరుగా భారత్‌ని సంప్రదించాల్సి ఉంటుందని తమ ప్రభుత్వం అమెరికాతో సహా అన్ని దేశాలకు తెలియజేసిందని ఆయన గుర్తు చేశారు.
ఆ తరువాత కాల్పులు ఆపడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ సైన్యం సందేశం పంపిందని, దానికి అనుగుణంగా భారత సైన్యం స్పందించిందని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ఎక్కడుందని వ్యాఖ్యాత ప్రశ్నించగా..‘‘పాక్, భారత్ మధ్యలోకి అమెరికా రాలేదు. అమెరికా తన పరిధిలోనే ఉండిపోయింది. సుదూరంగా అమెరికా గడ్డమీదనే ఆగిపోయింది’’ అని జైశంకర్ చమత్కరించారు. పహల్గాం ఉగ్రవాద దాడుల అంశంపై జైశంకర్ మాట్లాడారు. భారతీయుల మధ్య మత సామరస్యాన్ని చెడగొట్టడం, కశీ్మర్‌లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక పరిశ్రమను దెబ్బతీయడం వారి లక్ష్యమన్నారు. వారు ఉద్దేశపూర్వకంగా దాడికి మతపరమైన రంగును పులిమారని జైశంకర్ అన్నారు.
పాక్ నటించడం మానెయ్యాలి
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంలో తమ ప్రమేయం లేదని ప్రపంచం ముందు పాక్ నటించడం మానెయ్యాలన్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాల్లో ప్రభుత్వం మాత్రమే కాదు.. సైన్యం కూడా భాగస్వామి అని నొక్కి చెప్పారు. ‘‘ఐక్యరాజ్యసమితి నిషేధ జాబితాలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరూ పాకిస్తాన్‌లో ఉన్నారు. వారు పెద్ద నగరాల్లో, పట్టపగలు పనిచేస్తారు. వారి చిరునామాలు తెలుసు. వారి కార్యకలాపాలు తెలుసు. కాబట్టి ప్రమేయం లేదని పాకిస్తాన్ నటించకూడదు’’అని జైశంకర్ హితవు పలికారు.