పబ్‌జీ ‘ఆట’కట్టు

India bans 118 more mobile apps including PUBG - Sakshi

118 చైనా యాప్‌లపై నిషేధం

కేంద్ర ఐటీ శాఖ ఉత్తర్వులు

సాక్షి, న్యూఢిల్లీ: చైనా కవ్వింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్‌జీ సహా 118 చైనా మొబైల్‌ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పబ్‌జీ మొబైల్‌ లైట్, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్, అలీపే, వాచ్‌లిస్ట్, వీచాట్‌ రీడింగ్, కామ్‌కార్డ్‌తో పాటు పలు గేమింగ్‌ యాప్‌లు నిషేధానికి గురైన వాటిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటిపై కొరడా ఝళిపించింది. పబ్‌జీ గేమ్‌ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్‌లో పబ్‌జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు.  

లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ 29న కేంద్ర ప్రభుత్వం... అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. తర్వాత మరో 47 యాప్‌లను నిషేధిత జాబితాలో చేర్చింది. బుధవారం వేటుపడిన వాటితో కలిపితే ఇప్పటిదాకా భారత్‌ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. భారత్‌ లాంటి పెద్దమార్కెట్లో ఉనికి కోల్పోవడం ఈ చైనా కంపెనీలకు ఆర్థికంగా పెద్దదెబ్బే. టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం విధించాక... అమెరికా కూడా అదేబాటలో నడిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 15కల్లా టిక్‌టాక్‌ అమెరికా వ్యాపారాన్ని అమ్మివేయాలని, లేని పక్షంలో నిషేధం అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీచేశారు.  

దేశ భద్రతకు ముప్పు...
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్‌ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్‌లను నిషేధించింది. అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా ఆయా మొబైల్‌ యాప్‌లు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ప్రజాభద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున వాటిపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖకు వివిధ వర్గాల నుంచి ఆయా యాప్‌లపై అనేక ఫిర్యాదులు అందాయి.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్‌ యాప్‌లను దుర్వినియోగం చేయడం, వినియోగదారుల డేటాను దొంగిలించడం, అనధికారికంగా భారతదేశం వెలుపల ఉన్న సర్వర్‌లకు రహస్యంగా పంపించడం చేస్తున్నట్టు కేంద్రం గ్రహించింది. ఈ డేటా సంకలనం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను చివరికి జాతీయ భద్రతను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే విషయమని, దీనిని నిరోధించే తక్షణ చర్యలో భాగంగా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ హానికరమైన మొబైల్‌ యాప్స్‌ నిరోధించటానికి సమగ్రమైన సిఫారసు పంపింది. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వీటిని నిషేధించాలన్న డిమాండ్‌ ఉందని కేంద్ర ఐటీ శాఖ వివరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top