Droupadi Murmu: దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి

Independence Day 2022:President Draupadi Murmus Maiden Speech - Sakshi

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటన  

ఆర్థిక సంస్కరణలు, ప్రజా సంక్షేమ పథకాలతో దేశం ముందడుగు  

కరోనాపై పోరాటంలో గొప్ప విజయాలు సాధించాం 

మన గడ్డపై ప్రజాస్వామ్యం దినదిన ప్రవర్ధమానం 

ప్రపంచమంతా మనవైపు అబ్బురంగా చూస్తోంది  

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి తొలి ప్రసంగం

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసలైన శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ప్రపంచానికి భారత్‌ తోడ్పాటును అందించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. అణగారిన
వర్గాలు, పేదలు, అవసరాల్లో ఉన్నవారి పట్ల భారత్‌ దయార్ధ్ర హృదయంతో మెలుగుతోందని అన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఆమె రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 17 నిమిషాలపాటు ప్రసంగించారు. భారీ ఆర్థిక సంస్కరణలతోపాటు వినూత్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశం ముందడుగు వేస్తోందన్నారు. ‘‘సమున్నతంగా ఎదుగుతున్న నూతన భారత్‌ను ప్రపంచం అబ్బురంగా వీక్షిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే...

ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశాం  
‘‘భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు అంతర్జాతీయ నాయకులు, పాశ్చాత్య నిపుణులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. పేదరికం, నిరక్షరాస్యత తాండవిస్తున్న భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా? అని అనుమానించారు. వారి అనుమానాలను మనం పటాపంచలు చేశాం.

ఈ గడ్డపై ప్రజాస్వామ్యం కేవలం పురుడు పోసుకోవడమే కాదు, దివ్యంగా వర్థిల్లుతోంది. దినదిన ప్రవర్థమానమవుతోంది. దేశ భద్రత, ప్రగతి, సౌభాగ్యం కోసం సర్వశక్తులూ ధారపోస్తామని పౌరులంతా ప్రతిజ్ఞ చేయాల్సిన తరుణమిది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడంతోపాటు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విధాన రూపకర్తలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం.  

మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం  
కరోనా మహమ్మారిపై భారత్‌ సాగించిన పోరాటాన్ని ప్రపంచమంతా హర్షించింది. మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని మనం చేపట్టాం. కరోనా టీకాలను దేశీయంగానే తయారు చేసుకున్నాం. టీకా డోసుల పంపిణీలో 200 కోట్ల మార్కును గత నెలలోనే దాటేశాం. మహమ్మారిని నియంత్రించే విషయంలో అభివృద్ధి చెందిన కొన్ని దేశాల కంటే భారత్‌ గొప్ప విజయాలు సాధించింది.

ఇందుకు మన సైంటిస్టులు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కరోనా వైరస్‌ ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. ఈ సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాలతో ఎన్నో దేశాలు సతమతమవుతుండగా, భారత్‌ వేగంగా కోలుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటిగా నిలుస్తోంది.  

అప్పుడే మన మనుగడకు అర్థం  
భవ్యమైన భారత్‌ను నిర్మించుకుంటేనే మన మనుగడ మరింత అర్థవంతంగా మారుతుంది. మాతృదేశం కోసం, తోటి పౌరుల ప్రగతి కోసం త్యాగాలు చేయాలన్న పెద్దల మాటను గుర్తుంచుకోవాలి. 2047 నాటికి గొప్ప భారత్‌ను నిర్మించబోతున్న యువతకు ఇదే నా ప్రత్యేక విజ్ఞప్తి.

ప్రజాస్వామ్యం బాగా వేళ్లూనుకున్న దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లభించేందుకు చాలాకాలం పట్టింది. అందుకోసం వారు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, గణతంత్ర భారత్‌లో మొదటినుంచే వయోజనులందరికీ ఓటు హక్కు లభించింది. జాతి నిర్మాణంలో వయోజనులందరికీ భాగస్వామ్యం ఉండాలని అప్పటి పాలకులు నిర్ణయించారు.  

ఆర్థిక విజయంతో జీవితాలు సులభతరం    
మన దేశంలో స్టార్టప్‌ కంపెనీలు మంచి విజయం సాధిస్తున్నాయి. యూనికార్న్‌ కంపెనీల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం సంతోషకరం. మన పారిశ్రామిక ప్రగతికి ఇదొక ఉదాహరణ. ఈ క్రెడిట్‌ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, విధాన రూపకర్తలకు చెందుతుంది. మన ఆర్థిక వ్యవస్థ వెలుగులీనడానికి స్టార్టప్‌ కంపెనీలు దోహదపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఫిజికల్, డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పనలో అనూహ్యమైన వృద్ధి నమోదవుతోంది.

కార్మికులు, పారిశ్రామికవేత్తల కృషితోనే ఇది సాధ్యమవుతోంది. మనం సాధిస్తున్న అభివృద్ధి సమీకృతంగా, అసమానతలను తగ్గించేలా ఉంటుండడం ముదావహం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. దీర్ఘకాలంలో ఉపయోగపడేలా ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. విధాన నిర్ణయాలు అమలు చేయాలి. జాతీయ విద్యా విధానం కూడా ఆ కోవలోనిదే. ఆర్థిక విజయం ప్రజల జీవితాలను సులభతరం చేస్తుంది.  

సొంతిల్లు.. ఇక ఎంతమాత్రమూ కల కాదు
పేదలకు సొంతిల్లు అనేది ఇక ఎంతమాత్రం కలగా మిగిలిపోవడం లేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనతో అది వాస్తవ రూపం దాలుస్తోంది. జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయి నీరందుతోంది. ప్రజలందరికీ.. ముఖ్యంగా పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక విధులను ప్రజలంతా తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాటిని త్రికరణ శుద్ధితో ఆచరిస్తే మన దేశం ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఖాయం.

‘నేషన్‌ ఫస్ట్‌’ అనే స్ఫూర్తితో పనిచేయాలి. మనం స్వేచ్ఛగా జీవించేందుకు ఎంతోమంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు. వారిని స్మరించుకోవాల్సిన సందర్భం వచ్చింది. వలస పాలకుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి లభించిన దినం కేవలం మన ఒక్కరికే పండుగ రోజు కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ వేడుకే’’ అని రాష్ట్రపతి ముర్ము వివరించారు.    

భారత్‌ బహుమతులు యోగా, ఆయుర్వేదం
యువత, రైతులు, మహిళలు దేశానికి కొత్త ఆశారేఖలు. ముఖ్యంగా మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో వారి భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థల్లో 14 లక్షల మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళా క్రీడాకారులు మన దేశం గర్వపడేలా రాణించారు.

వారిలో చాలామంది అణగారిన వర్గాల నుంచి వచ్చినవారే. మన బిడ్డలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఏక్‌ భారత్, శ్రేష్ట భారత్‌ స్ఫూర్తిని అందిపుచ్చుకొని మనమంతా కలిసి ప్రయాణం సాగించాలి. యోగా, ఆయుర్వేదం అనేవి ప్రపంచానికి భారత్‌ ఇచ్చి న విలువైన బహుమతులు. ప్రపంచమంతటా వాటికి ఆదరణ పెరుగుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top