ఐటీ సిటీలో అతి పెద్ద సమస్య .. అక్రమసంబంధాలతో 981 జంటలు..

Illegal Relationship Cases are high in Bengaluru - Sakshi

ఇది సంపన్నుల నుంచి కూలీ కుటుంబాలకు వరకూ వేధిస్తున్న సమస్య. మూడో వ్యక్తి ప్రవేశం కాపురాల్లో చిచ్చు రేపుతోంది. ఇది దాడులకు, తీవ్ర నేరాలకు దారి తీస్తోంది. ఫలితంగా తల్లీతండ్రి విడిపోతే పిల్లలు అనాథలు కావడం మరింత విషాదమవుతోంది. నేటి ఆధునిక సమాజంలో సోషల్‌ మీడియా ద్వారా దాంపత్య బంధానికి తీవ్ర ప్రమాదం ఎదురవుతోంది.

సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, ప్రతిష్టకు పోయి విడాకులు తీసుకోవడంతో పాటు మరో ప్రధాన సమస్య సంసారాలను కకావికలం చేస్తోంది. వివాహేతర సంబంధాలు పచ్చని బంధాలను విచ్ఛిన్నం చేయడం వల్ల కుటుంబాల్లో అశాంతి ప్రబలుతోంది. తద్వారా విడాకులకు దారితీస్తున్న కేసులు నగరంలో రోజురోజుకు తీవ్రతరమౌతున్నాయి.  

సోషల్‌ మీడియా ఆజ్యం  
అక్రమ సంబంధాలకు అతిగా సోషల్‌ మీడియా వినియోగమే కారణమనేది రూఢీ అవుతోంది. ఇందులో ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియాలో పాత మిత్రులు, గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని దగ్గర కావడం వల్ల కాపురాలు ఇట్టే కూలిపోవడం పెరిగింది. దంపతుల మధ్య సఖ్యత లోపించడం, కొన్ని వ్యక్తిగత సమస్యలతో మూడో వ్యక్తితో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల చివరికి నష్టమే జరుగుతోంది. 

వనితావాణికి తాకిడి 
బెంగళూరులో గత మూడున్నర ఏళ్లలో అక్రమ సంబంధాల వల్ల విడాకుల దశకు చేరుకున్న 981 జంటలు వనితా సహాయవాణి కేంద్రాన్ని ఆశ్రయించాయి. వివాహానికి ముందు, తరువాత అక్రమ సంబంధం ఉందని తెలిసి  దంపతులు విడిపోతున్న ఉదంతాలు ఎక్కువైయ్యాయి. కోర్టులో విచారణ దశలో ఉన్న వేలాది విడాకుల కేసుల్లో   50 శాతానికి పైగా మూడో వ్యక్తి ప్రమేయమే కారణమని మహిళా సహాయవాణి కౌన్సిలర్‌ ఒకరు తెలిపారు.   

స్కూల్‌ మీటింగ్‌ అని గోవాకు  
బెంగళూరులో వివాహిత ఉపాధ్యాయురాలు ఫేస్‌బుక్‌లో పరిచయమైన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తితో స్నేహంగా ఉంటోంది. అతను టికెట్‌ పంపండంతో ఆ­మె విమానంలో గోవాకు వెళ్లింది. మూడురో­జుల­పాటు స్కూల్‌ మీటింగ్‌ అని చెప్పి వెళ్లిన భార్యపై అనుమానంతో భర్త స్కూల్‌కి వెళ్లి ఆరా తీశాడు. అసలు గుట్టు బయటపడింది. భర్త విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.  

చదవండి: (400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్‌తో బెంగళూరు నిర్మాణం.. నేటి దుస్థితికి కారణాలేంటి?)

ప్రశ్నించిన భార్యపై దాడి 
కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగి ఒకరు 34 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ కార్యక్రమంలో పరిచయమైన మరో మహిళతో అతడు సంబంధం నెరపసాగాడు. ఇది తెలిసి భార్య ప్రశ్నించడంతో విచక్షణారహితంగా దాడి చేసి ఇంట్లో నుంచి గెంటేశాడు.  ఆమె మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది.  

కుటుంబాన్ని ముక్కలు చేసుకోవద్దు  
2019 నుంచి 2022 జూలై వరకు 638 మంది జంటలు న్యాయ కోసం వనితా సహాయవాణి గడపతొక్కాయి. పెళ్లికి ముందే మరొకరితో సంబంధం ఉందని మరో 323 మంది ఫిర్యాదు చేశారు. గత ఏప్రిల్‌ నుంచి జూలై వరకు మూడు నెలల్లో 86 మంది దంపతుల సమస్య పరిష్కారానికి సహాయవాణిని ఆశ్రయించినట్లు కర్ణాటక మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. విలువైన కుటుంబ సంబంధాలను ముక్కలు చేసుకోవద్దని ఆమె జంటలకు సూచించారు. 

ఉన్నతాధికారి బండారం  
ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తోటి మహిళా అధికారితో వివాహేతర సంబందం కలిగి ఉన్నారు. నిత్యం మొబైల్‌లో చాటింగ్‌ చేసేవాడు. అనుమానం వచ్చిన భార్య అతను నిద్రలోకి జారుకున్న అనంతరం మొబైల్‌ను పరిశీలించగా బండారం వెలుగుచూసింది. దీంతో ఆ భర్తతో ఉండలేనంటూ ఆమె విడాకులు ఇవ్వడానికి కోర్టును ఆశ్రయించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top