400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్‌తో బెంగళూరు నిర్మాణం.. నేడు గజగజ వణకడానికి కారణాలేంటి?

Bengaluru Rains: Lakes turned layouts Causing Floods - Sakshi

బెంగళూరులో భారీగా చెరువులు, రాజకాలువల కబ్జా  

యాభై ఏళ్ల కిందట 837 చెరువులు, నేడు 219 మాత్రమే  

రాజధానిపై ఏటా రూ.20 వేల కోట్ల ఖర్చు  

ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట

చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఆ చెరువులు, వాటి అనుబంధ కాలువలు ప్రభుత్వ నిర్మాణాలకు, కబ్జాల వల్ల అదృశ్యమైపోయాయి. ఫలితంగా వర్షాలు వస్తే ఆ నీరు ఒకప్పుడు జల వనరులు ఉన్న చోటికే వెళ్తోంది. చివరికి ముంపు తయారవుతోంది. దీనివల్ల లక్షలాది జీవితాలు అవస్థల పాలయ్యాయి. 

బెంగళూరు: నాలుగు వందల ఏళ్ల కిందటే నాడప్రభు కెంపేగౌడ పకడ్బందీ ప్రణాళికతో నిర్మించిన చారిత్రక నగరం బెంగళూరు నేడు మామూలు వర్షానికే గజగజ వణికిపోవడం చూస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా తయారైందో ఇట్టే అర్థమవుతుంది. నగరంలో పకడ్బందీగా ఉన్న రాజ కాలువలు వారూ వీరూ అని తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు, భవనాలు కట్టేయడం, చెరువులను చదును చేసి లేఔట్లు నిర్మించడం వల్ల నైసర్గిక స్వరూపాలే మారిపోయి విపత్తులు పుట్టుకొస్తున్నాయి. ఉన్న చెరువులు, కాలువల్లో కూడా పూడిక పెరిగిపోయింది. వాతావరణ మార్పుల వల్ల ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం మరో కారణం. వర్షపు నీరు రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి చొరబడటంతో ముంపు తలెత్తుతోంది.  


బెల్లందూరు చెరువు దుస్థితి   

బెంగళూరు నగరంలో చెరువుల స్థానంలో నిర్మించిన కట్టడాల వివరాలు  
శూలె చెరువులో ఇప్పుడు ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మాణమైంది. అక్కితిమ్మనహళ్లి చెరువు– హాకీ స్టేడియంగా, సంపంగి చెరువు –కంఠీరవ స్పోర్ట్‌ కాంప్లెక్సా్గ, ధర్మాంబుధి చెరువు–కెంపేగౌడ బస్టాండుగా, చల్లఘట్ట చెరువు–కర్ణాటక గోల్ఫ్‌ మైదానంగా మారిపోయాయి.  
కోరమంగల చెరువు– నేషనల్‌ గేమ్స్‌ కాంప్లెక్స్‌ మైదానం, సిద్దికట్టె చెరువు–కేఆర్‌.మార్కెట్‌గా, కారంజీ చెరువు–గాంధీ బజార్, కెంపాబుధి చెరువు–భూగర్భ  డ్రైనేజీ సేకరణ ట్యాంక్‌గా మారిపోయాయి.  
నాగశెట్టిహళ్లి చెరువు– స్పేస్‌ డిపార్టుమెంట్, కాడుగొండనహళ్లి చెరువు–అంబేడ్కర్‌ మెడికల్‌ కాలేజీ, దుమ్మలూరు చెరువు–బీడీఏ లేఔట్, మిల్లర్స్‌ చెరువు–గురునానక్‌ భవన్‌ అయ్యాయి,  
సుభాష్‌ నగర చెరువు, కురబరహళ్లి చెరువు, కోడిహళ్లి చెరువు, సినీవాగిలు చెరువు,  
మారేనహళ్లి చెరువులు నేడు నివాస ప్రాంతాలుగా మారాయి. 
శివనహళ్లి చెరువు–క్రీడా మైదానం, బస్టాండుగా రూపాంతరం చెందాయి.   
చెన్నమనచెరువు –స్మశానం, పుట్టేనహళ్లి చెరువు– జేపీ నగర 6వ ఫేజ్, జక్కరాయనచెరువు – క్రీడా మైదానం అయ్యింది.


మారతహళ్లిలో బోటులో వెళ్తున్న జనం  

నగరానికి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు  
ప్రతి ఏడాది బెంగళూరు నగరాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వరద ముంపు సమస్యను తప్పించడం సాధ్యం కావడం లేదు. బీబీఎంపీ బడ్జెట్‌ సుమారు రూ.11 వేల కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరో రూ.10 వేల కోట్ల నిధులు లభిస్తాయి. ఇలా ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్లను బెంగళూరుపై ఖర్చు చేసినప్పటికీ ప్రజల సమస్యలు అలాగే ఉంటున్నాయి.  

ఒకనాటి పొలాలు, చిట్టడవులు మాయం
అందుకే ఇంత ముప్పు!  
ప్రకృతిని కాపాడుకోకపోవడమే ఈ వరద ముంపునకు కారణమని పర్యావరణవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షంతో జలమయమైన బెంగళూరులోని లేఔట్లు గతంలో పొలాలు, చెరువులు, అచ్చుకట్ట ప్రాంతాలు, చిట్ట అడవులతో కూడుకున్న ప్రదేశాలు. గత పది, ఇరవై ఏళ్లలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో భారీఎత్తున లేఔట్లు, కట్టడాలు, రోడ్లు నిర్మించారు. ఇప్పుడు కుండపోత వర్షాలకు చెరువుల్లా తయారయ్యాయి. ఏ ప్రాంతంలో ముందు చెరువు ఉండేది, ఎక్కడ రాజ కాలువ ఉండేది అనేదానిని ప్రస్తుత ముంపు చాటిచెబుతోందని పరిసరవాదులు అభిప్రాయపడ్డారు.  


రెయిన్‌ బో లేఔట్లో తీరని ముంపు కష్టం  

ప్రధానంగా బెల్లందూరు, వర్తూరు, విభూతిపుర, సావళచెరువు, బేగూరు చెరువు చుట్టుపక్కల లేఔట్లు ప్రస్తుతం భారీ వర్షాలతో జలంలో చిక్కుకున్నాయి. ఈ చెరువుల విస్తీర్ణం గత 40 ఏళ్లతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. ఈ చెరువులకు వెళ్లే రాజ కాలువలపై కట్టడాలు వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగించాల్సిన ప్రభుత్వం సక్రమ పథకంతో అనుకూలం చేయడం ప్రకృతికి మంచి చేయదని పరిసరవాది యల్లప్పరెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top