తీహార్‌ జైలు సూపరింటెండెంట్‌ సస్పెండ్‌.. మరి మంత్రి సంగతేంటి?: కిరణ్‌ బేడీ

If Tihar Superintendent Suspended Why Not Satyendar Jain: Kiran Bedi On Massage Fiasco - Sakshi

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌ జైల్లో శిక్షననుభవిస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్‌ నాయకుడు సత్యేంద్ర జైన్‌ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. జైలులో పోక్సో కేసులో నిందితుడైన ఖైదీతో మసాజ్‌ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. జైలులో ఉంటూనే సకల రాజభోగాలు అనుభవిస్తున్నారు. గదిలోనే రుచికరమైన  ఆహారం, తనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌ లాగిస్తూ ఇటీవల కెమెరాకు చిక్కారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా సత్యేంద్ర జైన్‌ జైలు విలాసాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ఘాటుగా స్పందించారు. మంత్రికి మసాజ్‌ చేసిన వ్యక్తి ఫిజియోథెరపీలో డిగ్రీ చేశాడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీహార్‌ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. జైన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  ఈ మేరకు ఓ జాతీయా మీడియాతో గురువారం మాట్లాడారు.
చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు..

తీహార్‌ జైలు పాలకుల తప్పిదం.. ఢిల్లీ రాజకీయ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. తమ సొంత మంత్రి జైలులో ఉంటే అధికారులు మాత్రం ఎలా చర్యలు తీసుకుంటారని సెటైర్లు వేశారు. ‘సొంత మంత్రి జైలులో ఉండటం చాలా అరుదైన సందర్భం.. లోపల ఉన్న జైలు బాస్ ఇప్పటికీ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతను ఏదైనా చేయగలడు, అడగగలడు. అతని ఆదేశాలకు జూనియర్లు కట్టుబడి ఉంటారు.

అవకతవకలు జరిగాయని సూపరింటెండెంట్‌ని ప్రభుత్వ సస్పెండ్‌ చేసింది. మరి మంత్రి సంగతేంటి? ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసే వ్యవస్థ మనకు లేదా. ఆప్ నేతకు మసాజ్ చేస్తున్న ‘పెద్దమనిషి’ ఫిజియో కాదని తెలిసింది. అతను అత్యాచారం కేసులో నిందితుడని జైలు అధికారులు పేర్కొంటున్నారు. మరి అతనికి ఫిజియోథెరపీలో డిగ్రీ ఉందా.. లేదా రేప్ చేయడానికి ముందు అతను ఫిజియోథెరపిస్ట్‌గా  పనిచేశారా’ అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై  విమర్శలు ఎక్కుపెట్టారు. అనుమతి ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ జైన్ సస్పెన్షన్ లేదా తొలగింపును రాష్ట్రపతికి సిఫారసు చేయాలని డిమాండ్‌ చేశారు.

కాగా భారత తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణీ అయిన కిరణ్‌ బేడీ.. 1993లో ఢిల్లీ జైళ్ల ఐజీగా నియమితులయ్యారు. తిహార్‌లో జైళ్ల డైరెకర్ట్‌ జనరల్‌గా ఉన్న సమయంలో పలు జైలు సంస్కరణలు ప్రవేశపెట్టినందుకు రామన్‌ మెగాసెస్‌ అవార్డు పొందారు. 2015లో బీజేపీలో చేరారు. 
చదవండి: అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top