
మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి.. జైలుపాలైన మంత్రి సత్యేందర్ జైన్..
ఢిల్లీ: మంత్రి కావడమే తాను చేసిన పెద్ద తప్పైపోయిందని, ఆ పదవే లేకుంటే తనపై ఆరోపణలు.. కేసు ఉండేవి కావని ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ అంటున్నారు. ఈ మేరకు మనీల్యాండరింగ్ కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన అభ్యర్థనలో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ ఎదుట సత్యేందర్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరణ్ శుక్రవారం వాదనలు వినిపించారు. విచారణ దశలో ఉండడంతో.. తొలి బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందని ఈ సందర్భంగా అడ్వొకేట్ హరిహరణ్ గుర్తు చేశారు. అయితే ఆరోపణల్లో పేర్కొన్నట్లు తన క్లయింట్ ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌గా, షేర్‌హోల్డర్‌గా లేరనే విషయాన్ని ప్రస్తావించారు. మంత్రి పదవితో ప్రజా జీవితంలోకి రావడమే తన తప్పైందంటూ సత్యేందర్ తరపున ఆయన వాదించారు. ఒకవేళ పదవిలో లేకుంటే.. అసలు తనపై కేసే ఉండేది కాదని చెప్పారాయన. అంతేకాదు.. ఈడీ సమర్పించిన ఆధారాల్లో సదరు కంపెనీల్లో జైన్ వాటాలు కలిగి ఉన్నట్లు నిరూపితం కాలేదని హరిహరణ్ వాదించారు.
ఇక సత్యేంద్ర జైన్ బెయిల్ అభ్యర్థన పిటిషన్‌పై నవంబర్ 5వ తేదీన ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, ఈడీ వాదనలు విననున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్(57) మే నెలలో అరెస్ట్ అయ్యారు.
ఇదీ చదవండి: సత్యేందర్ జైన్ హవాలా లింకులపై ప్రాథమిక సాక్ష్యాలు: కోర్టు