
బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(35)కు భారీ షాక్ తగిలింది. పని మనిషిపై లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ నేతను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
హాసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో 2021 COVID లాక్‌డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్‌లో వీడియో తీసి విషయం బయటకు చెప్పనీయకుండా బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అదే సమయంలో..
ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ ఆరోపణలను ప్రజ్వల్ పేరెంట్స్ ఖండించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగగా.. బెయిల్ కోసం ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది.
ఇదీ చదవండి: ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ??
ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు. CID-SIT దర్యాప్తులో DNA, ఫోరెన్సిక్, 26 మంది సాక్షుల వాంగ్మూలాలు, 2,000 పేజీల చార్జ్‌షీట్ సమర్పించారు. ఈ కేసులో 26 మంది సాక్షులను కోర్టు విచారించి.. దోషిగా ప్రకటించింది.
#Breaking
A Special court in Bengaluru has convicted Janata Dal (Secular) leader and former MP Prajwal Revanna, in the first rape case registered against him at the Holenarasipura Rural Police Station of Hassan District. #PrajwalRevanna #Rape pic.twitter.com/fnzxJUp2Sc— Live Law (@LiveLawIndia) August 1, 2025
ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ?
ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్‌లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్‌లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్‌లో లోపాల కారణంగా(రూ.24 కోట్ల లెక్కను చూపించకపోవడం) కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్ ఆయన్ని సస్పెండ్ చేసింది.

ఇదీ చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు
అశ్లీల వీడియోల కలకలం
పని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్‌పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్‌లోని ఫామ్‌హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్‌పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది. ఇందులో స్వయంగా ప్రజ్వల్ చాలావరకు వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాల్లో దర్యాప్తు అధికారులు పేర్కొనడం గమనార్హం.
ఇదీ చదవండి: అసహజ లైంగిక దాడి కేసులో పటుత్వ పరీక్షలు