కేంద్రం కొరడా.. 22 యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం.. వాటి లక్ష్యమదే!

IB Ministry Blocks 22 YouTube Channels For Spreading Fake News - Sakshi

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. దేశ భద్రత, జాతీయ సమగ్రత, విదేశీ సంబంధాలకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో 22 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిషేధించింది. ఇందులో 18 భారతీయ, 4 పాకిస్థాన్‌కు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్లలో మొత్తం వ్యూయర్‌షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది.

సంబంధిత యూట్యూబ్‌ చానళ్లు టెలివిజన్‌ లోగోలు, యాంక్లరను ఉపయోగించి, తప్పుడు థంబ్‌నెల్స్‌తో వీక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రం తెలిపింది. ఐటీ రూల్స్‌ 2021ను ఉల్లంఘించిన కారణంతో తొలిసారిగా 18 యూట్యూబ్ చానెళ్ల‌ను బ్లాక్ చేసిన‌ట్లు వెల్లడించింది. వీటితోపాటు మూడు ట్విటర్‌ అకౌంట్లు, ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌లను బ్లాక్‌ చేసింది. ఈ చానళ్లు భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ వివాదం వంటి అంశాలపై సామాజిక మధ్యమాల ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.
చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్‌.. పెళ్లైన రెండు వారాలకే..

అంతేగాక ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొన్ని భారతీయ యూట్యూబ్ ఛానెల్‌లు తప్పుడు కంటెంట్‌ను పబ్లిష్‌ చేస్తున్నారని, ఇవన్నీ ఇతర దేశాలతో భారత్‌కున్న విదేశీ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపింది. ఇవి పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. నిఘా వర్గాల సహకారంతో సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: Viral Video: మండుటెండలో కోతి దాహం తీర్చిన పోలీస్‌.. ‘హ్యాట్సాఫ్‌ సార్‌’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top