కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కారులో భారీగా నగదు కట్టలు!

Huge Cash Recovered From Jharkhand Congress MLAs Car in Bengal - Sakshi

బెంగాల్‌లో మళ్లీ కరెన్సీ కలకలం

హౌరా(పశ్చిమబెంగాల్‌): ఉపాధ్యాయ నియామక స్కామ్‌లో ఈడీ సోదాల్లో మాజీ మంత్రి పార్థా ఛటర్జీకి చెందినదిగా భావిస్తున్న రూ.50 కోట్ల నగదు కట్టలు గుట్టలుగా బయటపడటాన్ని మర్చిపోకముందే పశ్చిమబెంగాల్‌లో మళ్లీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. అది కూడా పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కార్లో! ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్, నమన్‌ బిక్సల్‌ కొంగరి శనివారం రాత్రి బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ప్రయాణిస్తున్న కారును పోలీసులు ఆపారు. అందులోంచి భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు హౌరా (రూరల్‌) ఎస్పీ స్వాతి చెప్పారు. ఇప్పటిదాకా రూ.50లక్షలకుపైగా నగదు లెక్కించామని, నగదు లెక్కింపు యంత్రాన్ని తెప్పిస్తున్నామని చెప్పారు.

మంత్రి ఇంట్లో నోట్ల కట్టల గుట్టలు..
టీచర్‌ నియామక కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్‌ చేసి విచారిస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఇప‍్పటికే ఆయనకు సంబంధించి నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రెండు సార్లు కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంది. మంత్రికి సంబంధించిన ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తోంది. ఛటర్జీకి సన్నిహితురాలైన నటి అర్పిత ముఖర్జీ రెండో అపార్ట్‌మెంట్‌లో బుధవారం దాడులు చేసిన ఈడీ రూ.28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా నగలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ముఖర్జీకి చెందిన మరో ఇంటిలో రూ.21.90 కోట్ల నగదు, రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది.

ఇదీ చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top