వడగండ్ల వాన, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్‌.. ఇవాళ రైలు రద్దు

Howrah Puri Vande Bharat Express cancelled After Hailstorm Damage - Sakshi

భువనేశ్వర్‌: దేశంలో అత్యంత వేగంగా పేరున్న సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌. అయితే ఈ రైలు నాణ్యత విషయంలోనే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు అందుకు కారణం. తాజాగా.. వడగండ్ల వానకు, పిడుగుపడి ఓ వందేభారత్‌ రైలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఒడిషాలో ఈమధ్యే ప్రారంభమైన పూరీ-హౌరా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(22896) ఆదివారం మధ్యాహ్నం ముందు భాగం దెబ్బతింది. భద్రాక్‌ రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో.. పిడుగుపడి డ్రైవర్‌ క్యాబిన్‌ విండ్‌స్క్రీన్‌, సైడ్‌ విండోలు పగుళ్లు వచ్చాయి. అయితే ఎవరికీ ఏం కాలేదు. అలాగే వడగండ్ల వాన కురిసి.. పలు కోచ్‌ల సైడ్‌ విండోలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు.. ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రిక్‌ వైర్‌ తెగిపోవడంతో వైతరణి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు రైలు ఆగిపోయింది.

రైలులో పవర్‌ సప్లై నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక.. ఓ డీజిల్‌ ఇంజిన్‌ను పంపించి రైలును అక్కడి నుంచి తరలించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) రైలును రద్దు చేశారు.   

ఒడిషా పూరీ నుంచి పశ్చిమ బెంగాల్‌ హౌరాను కనెక్ట్‌ చేస్తూ ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా గత గురువారం ప్రారంభించారు. వచ్చే నెల ముగింపు లోపు దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ వందేభారత్‌ రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది భారత రైల్వేస్‌. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top