రామ మందిరానికి 2.1 టన్నుల గంట

Hindu Muslim Artisans Made 21 Tonne Bell For Ram Mandir - Sakshi

జలేసర్‌లో రూపొందిస్తున్న హిందూ, ముస్లిం కళాకారులు

కంచు తదితర అష్ట ధాతువులతో రూపకల్పన

గంట శబ్దం 15 కి.మీ. దూరం వినిపిస్తుందంటున్న తయారీదారు

జలేసర్‌: అయోధ్య రామమందిరంలో ఏర్పాటుకానున్న 2,100 కిలోల బరువుండే గంట తయారీ దాదాపు పూర్తికావచ్చింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఈటా జిల్లా జలేసర్‌ పట్టణానికి చెందిన కళాకారులు ఈ బృహత్తర గంటను తయారు చేశారు. ముస్లిం కళాకారుడు డిజైన్‌ చేసే ఈ గంటను జలేసర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రామ మందిరానికి కానుకగా అందజేయనుంది. గంట శబ్దం సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందని తయారీదారు దావు దయాళ్‌ అంటున్నారు.

‘రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే అయోధ్య వివాదంలో కక్షిదారుగా ఉన్న నిర్మోహి అఖాడా మమ్మల్ని సంప్రదించింది. 2,100 కిలోల బరువుండే గంటలను తయారు చేయాలని కోరింది. దీనిని దైవ కార్యంగా భావిస్తూ.. దేశంలోని అతిపెద్ద గంటల్లో ఇది ఒకటైన ఈ గంటను మేమే ఎందుకు ఆలయానికి కానుకగా ఇవ్వకూడదని భావించాం’అని జలేసర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వికాస్‌ మిట్టల్‌ తెలిపారు.  దీనికి రూ.21 లక్షలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు.

దేశంలోని అతిపెద్ద గంటల్లో ఒకటి
జలేసర్‌కు చెందిన దావు దయాళ్‌ కుటుంబం నాలుగు తరాలుగా గంటల తయారీ వృత్తిలో కొనసాగుతోంది. 2,100 కిలోల బరువున్న గంటను తయారు చేయడం ఇదే మొదటిసారి.  గంటల డిజైనింగ్, పాలిషింగ్, గ్రైండింగ్‌లో ఇక్కడి ముస్లిం పనివారు మంచి నిపుణులు. 2.1 టన్నుల ఈ గంటకు ఇక్బాల్‌ మిస్త్రీ డిజైన్‌ చేశారు’అని చెప్పారు. హిందూ, ముస్లిం మతాలకు చెందిన 25 మంది పనివారు రోజుకు 8 గంటల చొప్పున నెలపాటు పనిచేశారు. కంచుతోపాటు బంగారం, వెండి, ఇత్తడి, రాగి, సీసం, తగరము, ఇనుము, పాదరసం వంటి అష్టధాతువులను ఇందులో వినియోగించాం. ఈ మిశ్రమాన్ని మూసలో నింపడంలో 5 సెకన్లు తేడా వచ్చినా మొత్తం ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది’అని డిజైనర్‌ ఇక్బాల్‌ మిస్త్రీ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top