కరోనా : మార్కెట్‌లోకి హెటిరో ‘ఫావిపిరవిర్‌’ ట్యాబ్లెట్‌

Hetero Launches Generic Corona Antiviral Drug Favipiravir At Rs 59 Per Tablet - Sakshi

న్యూఢిల్లీ : కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ ‘ఫావిపిరవిర్‌’ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటీరో బుధవారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఫావిపిరవిర్‌ ఒక్క ట్యాబ్లెట్‌ ధర రూ. 59గా నిర్ణయించినట్టు తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది.  ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదివరకే కరోనా చికిత్సలో వినియోగించే రెమ్డిసివిర్‌ ఔషధాన్ని ‘కోవిఫర్‌’ ఇంజెక్షన్‌ పేరుతో తమ సంస్థ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఫావిపిరవిర్‌ ఔషధం క్లినికల్‌గా సానుకూల ఫలితాలు ఇచ్చిందని తెలిపింది. (కోవిడ్‌-19 వ్యాక్సిన్ల ధరల యుద్ధం?!)

ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు సంబంధించి డీసీజీఐ నుంచి అన్ని అనుమతులను పొందినట్టు హెటిరో వెల్లడించింది. హెటిరో హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌ ద్వారా ఫావిపిరవిర్‌ ఔషధం మార్కెటింగ్‌ చేయబడుతుందని.. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్‌ మెడికల్‌ షాపుల్లో, హాస్పిటల్స్‌ ఫార్మసీలలో.. ఈ ఔషధం నేటి నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పింది. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ మేరకే ఈ డ్రగ్‌ను విక్రయించడం జరుగుతుందని తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న ఎక్కువ మంది కోవిడ్‌ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ ఔషధం తోడ్పతుందని పేర్కొంది. దేశంలోని తమ కంపెనీ ఫార్ములేషన్‌ ఫెసిలిటీలో తయారవుతున్న ఈ డ్రగ్‌కు గ్లోబల్‌ రెగ్యులేటరీ అధికారులు కూడా ఆమోదించారని వెల్లడించింది.(హెటిరో ‘కోవిఫర్‌’ ధర రూ.5,400)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top