ఆ అనాథ బాలలకు సాయపడండి

Help children orphaned by COVID-19 orders Supreme Court - Sakshi

కోవిడ్‌తో కన్నవారిని కోల్పోయిన వారి వివరాలను నమోదు చేయాలి

తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ లేదా   తల్లి, తండ్రిని కోల్పోయిన చిన్నారుల వివరాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. కోవిడ్‌ లేదా ఇతర కారణాలతో అనాథలుగా మారిన చిన్నారులను గుర్తించి, వారికి రాష్ట్రాలు తక్షణమే సాయం అందించాలంటూ సుమోటోగా స్వీకరించిన కేసుపై శుక్రవారం జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘కరోనా బారినపడి తల్లి, తండ్రి, లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు మహారాష్ట్రలో 2,900 మంది వరకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మహమ్మారి బారినపడి దిక్కులేని వారిగా మారిన ఇటువంటి చిన్నారులు ఇంకా ఎందరు ఉన్నారో ఊహించలేం. మా ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా.. ఆకలితో అలమటిస్తూ వీధుల్లో తిరిగే అటువంటి బాలలను తక్షణమే గుర్తించి, వారి బాధ్యతను యంత్రాంగం తీసుకోవాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. అనాథలైన చిన్నారుల వివరాలు తక్షణమే లేదా శనివారం సాయంత్రానికి ‘బాల్‌ స్వరాజ్‌’ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.   తదుపరి విచారణను జూన్‌ ఒకటో తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top