వ్యాక్సినేషన్‌ : తొలిగా ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం

Health Minister Responds On Coronavirus Vaccine - Sakshi

కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌

సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జులై నాటికి 130 కోట్ల దేశ జనాభాలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆదివారం వెల్లడించారు. ఈ దిశగా ప్రభుత్వం 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను సేకరిస్తుందని, వ్యాక్సిన్‌ను సమంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు. ఏయే గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్‌ అందచేయాలనే వివరాలతో ప్రాధాన్యతా గ్రూప్‌లను పేర్కొంటూ ఈ నెలాఖరులోగా జాబితాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని చెప్పారు. వ్యాక్సిన్‌ సేకరణను కేంద్రకృతంగా చేపట్టి ప్రతి కన్‌సైన్‌మెంట్‌ను రియల్‌టైంలో ట్రాక్‌ చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్‌ను ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు అందచేస్తామని డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, పారిశుద్ధ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో పాటు వైరస్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ ప్రక్రియలో నిమగ్నమైన ఇతరులకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ను వేస్తామని చెప్పారు. వ్యాక్సిన్‌ సమంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని, భారత వ్యాక్సిన్‌ తయారీదారులకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భారత్‌లో పలు వ్యాక్సిన్‌లు కీలక దశ పరీక్షలకు చేరుకోవడంతో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా పాజిటివ్‌ కేసులతో కలిపి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. చదవండి : ‘కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top