హథ్రాస్‌: సీబీఐ విచారణ వేగవంతం

Hathras Case CBI Team Questions Victim Family Again - Sakshi

లక్నో: హథ్రాస్‌ సామూహిక లైంగిక దాడి, హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఘటనాస్థలి వద్దకు వెళ్లి వివరాలు సేకరించిన సీబీఐ బృందం, శనివారం మరోసారి బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసింది. భూల్ఘర్‌లోని వారి ఇంటికి వెళ్లి, సుమారు ఐదు గంటల పాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలి తల్లి, వదిన చెప్పిన వివరాలను నమోదు చేసుకుంది. వీరితో పాటు చోటు అనే సాక్షిని కూడా విచారించినట్లు సమాచారం. అంతేగాకుండా ఈ కేసులోని ప్రధాన నిందితుడు, బాధితురాలి మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లు ఆధారాలు పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో, ఈ విషయం గురించి బాధితురాలి కుటుంబ సభ్యులను ఆరా తీసినట్లు తెలుస్తోంది. (చదవండి: వాళ్లు భయపడ్డం లేదు.. జైలు మార్చండి!)

కాగా, ఈ కేసులోని నలుగురు నిందితుల కుటుంబసభ్యుల్ని సీబీఐ అధికారులు గురువారం విచారించిన విషయం తెలిసిందే. ఆధారాల సేకరణ కోసం వారి ఇళ్ల వద్ద సెర్చ్‌ ఆపరేషన్‌లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిందితుడు లవ్‌ కుశ్‌ సికార్వర్‌ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అవి రక్తపు మరకలు కాదని, ఎర్రని పెయింట్‌ అని అతడి సోదరుడు వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక హథ్రాస్‌‌ దళిత యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణను పర్యవేక్షించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా బాధితురాలి కుటుంబానికి, ఈ కేసులోని సాక్షులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే, బాధితురాలి ఇంటి వద్ద విధులు నిర్వరిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతరత్రా వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. (‘ఎవరికీ భయపడం.. న్యాయం తప్ప ఇంకేమీ వద్దు’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top